చిత్రం :‘ఫిదా’
నటీనటులు: వరుణ్ తేజ్ - సాయి పల్లవి - సాయిచంద్ - రాజా - సత్యం రాజేష్ - హర్షవర్ధన్ రాణె - గీతా భాస్కర్ - మనీషా తదితరులు
సంగీతం: శక్తి కాంత్
ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్
నిర్మాత: దిల్ రాజు
రచన - దర్శకత్వం: శేఖర్ కమ్ముల
కధ-కధనం-విశ్లేషణ :
అమెరికా లో మెడిసిన్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్) , తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే భానుమతి (సాయి పల్లవి ) ల మధ్య ప్రేమ కధ. వరుణ్ అన్నయ్య కి ,భాను అక్కకి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లిలోనే ఇద్దరూ దగ్గరవుతారు. తమ మనసులో మాటను ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి వాళ్ళు పడే సంఘర్షణే మిగతా కధ.
గత రెండు చిత్రాల్లో తన మార్క్ చూపించలేకపోయిన శేఖర్ కమ్ముల,ఈసారి చాలా సింపుల్ లవ్ స్టోరీ ని తనదైన స్టైల్ లో తెరకెక్కించి ఆకట్టుకున్నాడు.
పల్లెటూరి నేపధ్యం లో సాగే ఫస్టాఫ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వరుణ్-భాను ల మధ్య సన్నివేశాలు అన్నీ అలరిస్తాయి. సరదాగా ఆటపట్టించడం తో మొదలయి ప్రేమలో పడే తీరు సహజంగా ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ ఫాక్టర్ తో పాటు డైలాగ్స్ లో ఉండే చమక్కులు కలిసి ఎంటర్టైనింగ్ గా సాగుతుంది ఫస్టాఫ్. ఆ ఫీలింగ్ ని మరో స్థాయి కి తీసుకెళుతుంది "హే పిల్లగాడా' పాట. మంచి లీడ్ సీన్ తో పాటు ఆ పాట చిత్రీకరణ కూడా చాలా చాలా బాగుండి అలరిస్తుంది. ఎక్కువగా లీడ్ పెయిర్ మధ్య సన్నివేశాలు ఉన్నా, వాళ్ళ కుటుంబం మధ్యలో సన్నివేశాలు కూడా సహజంగా ఉండి ఆకట్టుకున్నాయి.
ఐతే సెకండాఫ్ లో ఇద్దరి మధ్య దూరం పెరిగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. వాళ్ళ ప్రవర్తన మొదట్లో కాస్త సిల్లీ గా అనిపించినా,వరుణ్ అనుభవిస్తున్న భాదని,ప్రేమని చెప్పుకోలేక భాను పడే సంఘర్షణ ని బాగా ఎస్టాబ్లిష్ చేసాడు కమ్ముల. తరువాత ఎం జరుగుతుందో తెలిసినా,కాస్త సాగదీసినట్టు అనిపించినా,లీడ్ పెయిర్ మధ్య కాన్వర్‌జేషన్స్ సినిమా ని నిలబెట్టాయి.
నటీనటులు:
వరుణ్ పాత్రకు అనుగుణంగా నటించాడు. సెకండాఫ్ లో హీరోయిన్ ప్రేమ కోసం తపించే సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. 'సింగిల్ పీస్' భానుమతి క్యారెక్టర్ లో సాయి పల్లవి నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతగా తన ముద్ర వేసింది ఆ పాత్ర లో. చలాకితనం తో పాటు, తండ్రికి ప్రేమకి మధ్య ఊగిసలాడే
ఎమోషనల్ సీన్స్ లో కూడా రాణించింది. "హే పిల్లగాడా' పాటని తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలు, డాన్స్ తో కట్టిపడేసింది. హీరోయిన్ తండ్రి పాత్రలో సాయి చాంద్ నటన కూడా బాగుంది. అలాగే అక్క పాత్ర చేసిన శరణ్య కూడా ఆకట్టుకుంది, రాజా, ఆర్యన్ తల్లా ఆ పాత్రలకు సరిపోయారు. సత్యం రాజేష్ చిన్న పాత్రే అయినా ఉన్నంతలో బాగానే నవ్వించాడు ,హర్షవర్ధన్ రాణే... తదితరులు ఒకే.
సాంకేతిక వర్గం:
శక్తికాంత్ అందించిన పాటలు బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా కూడా పాటలని ఉపయోగించుకున్న తీరు బాగుంది. కెమెరా వర్క్ చాలా ఆహ్లాదంగా ఉంది. అటు అమెరికా నేపధ్యం ,ఇటు పల్లెటూరి అందాలని బాగా తెరకెక్కించారు.
రేటింగ్ : 6.5/10
0 comments:
Post a Comment