రివ్యూ: అరవింద సమేత... వీర రాఘవ
తారాగణం: ఎన్టీఆర్, పూజ హెగ్డె, జగపతిబాబు, సునీల్, నవీన్ చంద్ర, ఈషా రెబ్బా, రావు రమేష్, శుభలేఖ సుధాకర్, నాగబాబు, శ్రీనివాసరెడ్డి, సుప్రియ పాఠక్, సితార, దేవయాని తదితరులు
సంగీతం: తమన్ .ఎస్
ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్
కూర్పు: నవీన్ నూలి
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
కథ, కథనం, దర్శకత్వం: త్రివిక్రమ్
ఫ్యాక్షనిజం నేపధ్యం లో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి, ఆ కాలంలో ట్రెండ్ గా వరుస పెట్టి వచ్చిన దగ్గర్నుండి నిన్న మొన్నటి వరకు కూడా అడపా దడపా వస్తూనే ఉన్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా , అందులో ఎన్ని పోరాటాలు,తొడ కొట్టడాలు వగైరా ఫార్ములా లు దట్టించినా అంతిమంగా అందులో చెప్పేది హింస ని ఆపమనే సందేశమే. అలాంటి అంశాన్నే దర్శకుడు త్రివిక్రమ్ కాస్త నిజాయతి తో , శ్రద్ధ తో చెప్పే ప్రయత్నం చేసాడు "'అరవింద సమేత వీర రాఘవ" తో..
మామూలు గా ఇంటర్వెల్ వద్ద పడాల్సిన భారీ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుంది. ఆ మారణకాండ వెనుక నేపధ్యం ఏంటో ముందు కొంచెం చూపించి,ఆ తరువాత జరిగిన ఘోరం తాలూకు ఛాయలు ఊరిని ఎలా కమ్మేసాయో తెలుసుకున్న హీరో.. తరువాత ఏంటి అన్న ప్రశ్న తో ఊరిని వదిలిపెట్టడం .. ఇక్కడి వరకు ఒక ఇంటెన్సిటీ తో నడుస్తుంది కధనం.
ఐతే ఆ తరువాత హీరో సమస్య కు పరిష్కారం కనుగొనేందుకు ఉపయోగపడే పాత్ర లా అనుకున్న అరవింద క్యారెక్టర్ ని అంత స్ట్రాంగ్ గా చూపించలేకపోయాడు త్రివిక్రమ్. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ సాధారణంగా ఉంటుంది .చాలా మామూలు మాటల్లో భాగంగా ఆమె చెప్పే విషయాలు హీరో పరిస్థితులకి అన్వయించుకోవడం అనే అంశం బాగున్నా, అంతలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఆ అమ్మాయి ప్రవర్తన మాత్రం చాలా వరకు తింగరిగా అనిపిస్తుంది. ఇక నరేష్ కామెడీ ట్రాక్ ఐతే మరీ పేలవంగా ఉంటుంది. ఈ టోటల్ ఎపిసోడ్ తో సినిమా బ్యాలెన్స్ తప్పి పోయే ప్రమాదం నుండి అక్కడక్కడా కొన్ని మంచి డైలాగు/సన్నివేశాలుకాపాడుతాయి ..ఉదాహరణ కు హీరో సిటీ కి వచ్చిన తన అనుచరులని కలిసి మాట్లాడడం వంటివి. ఇక విలన్ బ్యాచ్ రి ఎంట్రీ ..ఫైట్ తో ఇక అసలు సమరం అని ఫస్టాఫ్ ని ముగించిన త్రివిక్రమ్.. ఆ పై సైడ్ ట్రాక్ ల జోలికి పోకుండా సెకండాఫ్ ఆద్యంతం అసలు సమస్య మీదే దృష్టి పెట్టడం తో మళ్ళీ గాడిలో పడుతుంది కధనం.
మినిస్టర్ తో మీటింగ్ ఎపిసోడ్, అటు పై ఫోన్ లోనే విలన్ మనుషుల్ని బెదిరించే సన్నివేశం బాగా వచ్చాయి. ఆ తరువాత వచ్చే రాజీ/టార్చ్ బేరర్ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అని చెప్పుకోవచ్చ్చు. ఒక్క సన్నివేశం తో అటు సినిమా లో పాత్రలు, ఇటు సినిమా చూస్తున్న ప్రేక్షకుడు హీరో కి సలాం కొట్టే లెవెల్ లో ఆ ఘట్టాన్ని తీర్చిదిద్దాడు త్రివిక్రమ్. ఆ తరువాత కాస్త రొటీన్ బాట పట్టినట్టు అనిపించినా, మనిషి తో పాటు హింస ని అంతం చేసే క్లైమాక్స్ తో మళ్ళీ ఆకట్టుకుంటాడు..
పైకి అంత గొప్ప పాత్రగా అనిపించకపోయినా, సినిమా ముందుకెళ్తున్న కొద్దీ పరిణతి చెందే వీర రాఘవ పాత్ర లో మమేకం ఐపోయేలా కట్టిపడేసాడు ఎన్టీఆర్. అతడి కి అంతే దీటు గా బసిరెడ్డి పాత్ర లో చెలరేగిపోయాడు జగపతి బాబు. పూజ హెగ్డే పాత్ర కాస్త చిత్రం గా ఉన్నా, నటన పరవాలేదు.నాగబాబు,నవీన్ చంద్ర ,బ్రహ్మాజీ,శత్రు ఆయా పాత్రలకు సరిపోయారు. సునీల్ ఉన్నంత లో బాగానే నవ్వించాడు.. తదితరులు పరవాలేదు. థమన్ సంగీతం లో పాటలు పరవాలేదు,ఆన్ స్క్రీన్ వాటిని ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉండచ్చు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
రచయిత గా .. దర్శకుడి గా చాలా వరకు త్రివిక్రమ్ అనుకున్నది చెప్పడం లో సఫలమయ్యాడు. ఐతే సీన్ సిటీ కి షిఫ్ట్ అయ్యాక,కామెడీ స్థానం లో సమాంతరంగా ఊరి ప్రజలు మార్పు కోసం తమ వంతు చేసిన ప్రయత్నం , పడ్డ శ్రమ చూపించి ఉంటే కూడా కాస్త నడిపి ఉంటే బాగుండేది. అలాగే చివర్లో ఆడవాళ్ళ గొప్పతనం గురించి హీరో చెప్పిన మంచి మాటలు ఇంకా మోగుతూ ఉండగానే కాస్త అసందర్భంగా సన్నివేశాన్ని పొడిగించడం అంతగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 66/100
0 comments:
Post a Comment