చిత్రం: రంగస్థలం
తారాగణం: రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ, ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ, జబర్దస్త్ మహేష్, అజయ్ ఘోష్, తదితరులు
కూర్పు: నవీన్ నూలి
కళ: రామకృష్ణ
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సివిఎం)
రచన, దర్శకత్వం: బి. సుకుమార్
ఎప్పుడూ మైండ్ గేమ్స్ ,కాస్త చిత్రమైన లాజిక్ల తో ఆటాడుకునే సుకుమార్... కాస్త ఆ మేధావితనాన్ని పక్కన పెట్టి మూలాలు వెతుకున్న తీరు లో పల్లెటూరి నేపథ్యం లో. 1980 ల నాటి కాలం సినిమా చేస్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అది రామ్ చరణ్ కాంబినేషన్ లో అనగానే మరింత రెట్టింపు అయింది.
స్వతహాగా తన సినిమాల్లో టైటిల్స్ దగ్గరనుంచే తన ప్రత్యేకత ని చూపించే సుకుమార్.. ఈసారి ఆ పద్ధతి లో కాకుండా మామూలుగానే మొదలు పెట్టాడు. సినిమా కధ కూడా అంత ప్రత్యేకం ఏమీ కాదు పల్లెటూరి నేపధ్యం అనగానే అంచనా వేయగలిగే చట్రం లో ఉన్నదే. ఐతే ఈ సాధారణ కధకి ఆధ్యంతం వెన్నంటే ఉండి, దాన్ని మరో స్థాయి కి తీసుకెళ్లిన ఘనత చిట్టిబాబు కి.. ఆ పాత్రలో జీవించిన చరణ్ కి.. ఆ పాత్రని అంతే చక్కగా మలచిన సుకుమార్ కి దక్కుతుంది. మామూలు గా హీరో కి సరైన క్యారెక్టర్ లు దక్కి.. ఆయా పాత్రల్లో వారి నటనతో ఆకట్టుకోవడం వేరు. కానీ అరుదుగా కొన్ని సినిమాలు/పాత్రలు కేవలం ఆ నటుడి కోసమే పుట్టాయా అన్న రీతిలో కుదురుతాయి. రామ్ చరణ్ కి ఈ చిట్టిబాబు పాత్ర అలాంటిదే. ఖచ్చితంగా తన కెరీర్ లోనే గుర్తుండిపోయే పాత్ర..అలాగే మిగతా నటీనటులకి కూడా మంచి పాత్రలే దక్కాయి .కుమారు బాబుగా ఆది చాలా సహజంగా నటించాడు.. జబర్దస్త్ మహేష్, అజయ్ ఘోష్,బ్రహ్మాజీ తదితరులు చిన్న పాత్రలైనా గుర్తుంటారు. రత్నవేలు, దేవిశ్రీప్రసాద్.. ఇతర సాంకేతిక వర్గం దర్శకుడికి తమ వంతు సహకారం అందించి సినిమాని నిలబెట్టారు.
కధనం విషయానికి వస్తే, ఫస్టాఫ్ చాలా భాగం పాత్రల పరిచయం,తరువాత జరగబోయే కధకు లీడ్ లాగా సాగుతుంది.లవ్ ట్రాక్ , అలాగే ఊరి ప్రజలతో చిట్టిబాబు కామెడీ బాగానే పండింది. పంచాయతీ సీన్ తో మొదలైన ఊపు నామినేషన్ ఎపిసోడ్ నుండి చివరి వరకు సాగుతుంది . మధ్యలో అక్కడక్కడా తడబడ్డా .. చివరి 20 నిమిషాల్లో తనదైన మార్క్ ట్విస్ట్ తో క్లైమాక్స్ ని నడిపి ఆకట్టుకుంటాడు సుకుమార్ . ఆ వ్యవహారం అంతగా ఊహించలేనిది కాదు కానీ ఆవేశం లో ఉన్న హీరో ని కాసేపు అయోమయం లో పడేసి మళ్ళీ అతడి పాత్రని హై నోట్ లో ఎండ్ చేయడం బాగుంది. ఐతే ముందు నుండి అంత బిల్డప్ ఇచ్చిన ప్రెసిడెంట్ పాత్రని ముగించిన తీరు అంతగా బాగోలేదు. ఆ వ్యవహారం కొంచెం గజిబిజిగా అనిపించింది.
రేటింగ్:70/100
0 comments:
Post a Comment