కథ:
కోల్ కతా జైల్లో శిక్ష అనుభవిస్తున్న కత్తి శీను (చిరంజీవి) పోలీసులను బోల్తా కొట్టించి ఆ జైలు నుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చేస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్లబోతూ ఎయిర్ పోర్టులో లక్ష్మి (కాజల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయి ఆ ప్రయత్నం మానుకుంటాడు. ఇంతలో కొన్ని కారణాల వల్ల శీను తనలాగే ఉండే శంకర్ అనే ఉద్యమకారుడి స్థానంలోకి వెళ్లాల్సి వస్తుంది. మరి శంకర్ స్థానం లోకి వెళ్లి శీను ఎం చేశాడు,అసలు శంకర్ నేపధ్యం ఏంటి ?? అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
దాదాపు గా దశాబ్దం తరువాత మెగాస్టార్ చిరంజీవి రి ఎంట్రీ ఇస్తున్న చిత్రం కనుక "ఖైదీ నెంబర్ 150" లో ఫోకస్ అంతా ఆయన మీదే ఉంది. ఆయన నటనలో,లేదా స్క్రీన్ ప్రెజన్స్ విషయం లో ఏమైనా తేడా ఉందా అన్న ప్రశ్నలకు చాలా వరకు సంతృప్తి కలిగించే సమాధానాలు ఉన్నాయి సినిమా లో.
రైతులకి,కార్పొరేట్ సంస్థల మధ్య జరిగే పోరాటం అనే నేపధ్యానికి కమర్షియల్ హంగులని జోడించారు. ఫస్టాఫ్ లో హీరో ఇంట్రో ఎపిసోడ్ బాగుంది,కాజల్ తో లవ్ ట్రాక్ ,మధ్యలో కొంత కామెడీ తో పరవాలేదు అనిపించేలా సాగుతుంది కధనం. ప్రధాన కధ అయిన రైతుల బాధలు తెలిపే ఫ్లాష్ బ్యాక్ సినిమా కి బెస్ట్ ఎపిసోడ్.అక్కడినుంచి సినిమా సరైన ట్రాక్ లో పడుతుంది. హీరో- విలన్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ తో మంచి హై నోట్ లో ఎండ్ అవుతుంది ఫస్టాఫ్. ఇక సెకండాఫ్ లోనూ అదే టెంపో మైంటైన్ అయింది. విలన్ ని ఎదుర్కునే క్రమం లో వచ్చే కాయిన్ ఫైట్ చాలా బాగుంది. అలాగే అంత సజావుగా సాగిపోతుంది అనుకున్న దశలో హీరో ఓడిపోయే పరిస్థితి రావడం, ఆ సమస్య నుండి బయట పడడానికి హీరో కి ఉపయోగపడే "వాటర్" ఎపిసోడ్ తో సినిమా మరో స్థాయి కి వెళ్ళింది. ఐతే అదే ఇంటెన్సిటీ ని క్లైమాక్స్ లో కంటిన్యూ చేయలేకపోయారు. అప్పటి దాకా జరిగిన కధ కు మరింత బలమైన ముగింపు ఉండాల్సింది.
దర్శకుడిగా వి. వి.వినాయక్ ముందుగానే చెప్పుకున్నట్టు సీరియస్ గా సాగే కధకు కమర్షియల్ టచ్ ఇవ్వడం లో పెట్టిన శ్రద్ధ, ఓవరాల్ గా ప్రధాన కధకు తగ్గ ఎమోషనల్ డెప్త్ ఉండేలా చూసుకుని ఉంటే బాగుండేది.
నటీనటులు:
చిరంజీవి అటు కత్తి శీను గా మాస్ రోల్ లో తనదైన శైలిలో అలరించాడు, అలాగే శంకర్ పాత్రలో భావోద్వేగ సన్నివేశాల్లో కూడా రాణించాడు. కామెడీ టైమింగ్ లో ఐతే ఏ మాత్రం మార్పు లేదు. వయసుని దాచేసే లుక్స్ తో ఎనర్జీ తో ఆకట్టుకున్నాడు. కాజల్ కు పాటల్లో తప్ప పాత్ర పరంగా మాత్రం స్కోప్ లేదు. విలన్ గా తరుణ్ అరోరా తేలిపోయాడు. హీరో ఫ్రెండ్/అసిస్టెంట్ తరహా పాత్ర లో ఆలీ ఒకే. బ్రహ్మి కామెడీ పరవాలేదు, రఘుబాబు.. జయప్రకాష్ రెడ్డి ఒకట్రెండు సన్నివేశాల్లో నవ్వించారు. మిగతా వాళ్లంతా మామూలే.
ఇతర సాంకేతిక వర్గం:
సినిమాకు పరుచూరి బ్రదర్స్.. సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి కలిసి అందించిన మాటలు బాగున్నాయి, హీరోయిజం తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ సినిమా కి ప్లస్ అయ్యాయి. కెమెరా వర్క్ బాగుంది. హీరో ని,టోటల్ గా సినిమా ని రిచ్ గా ప్రెజంట్ చేసిన తీరు బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో పాటలు బాగానే ఉన్నాయి, నీరు నీరు పాట ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా కూడా బాగా ఉపయోగించుకున్నాడు. ఐతే అది తప్ప మిగతా సినిమా లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండాల్సింది.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment