రివ్యూ: ఎన్టీఆర్
బ్యానర్: ఎన్‌బికె ఫిలింస్ ఎల్‌ఎల్‌పి
తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్‌రామ్, సుమంత్, రానా దగ్గుబాటి, దగ్గుబాటి రాజా, ప్రకాష్‌రాజ్, మురళిశర్మ, నిత్య మీనన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు
మాటలు: సాయి మాధవ్ బుఱ్ఱా
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
కళ: సాహి సురేష్
కూర్పు: అర్రం రామకృష్ణ
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్.
సహ నిర్మాతలు: సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాతలు: వసుంధరా దేవి నందమూరి, బాలకృష్ణ నందమూరి
కథ, కథనం, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
తెలుగు సినిమా దిగ్గజం నందమూరి తారక రామారావు గారి జీవితాన్ని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ సినిమా గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.దర్శకుడు క్రిష్ ఆ ప్రయత్నం లో ఎంతవరకు సఫలం అయ్యాడో చూద్దాం.
బయోపిక్ లు మన తెలుగు సినిమాల్లో అరుదు, నిన్న గాక మొన్న వచ్చిన మహానటి ఆ జానర్ లో ఒక స్టాండర్డ్ ని క్రియేట్ చేసింది. ఐతే సావిత్రి గారి జీవితం లో ఉన్నన్ని మలుపులు,ఒడిదుడుకులు ఎన్టీఆర్ గారి జీవితం లో ఉండి ఉండకపోవచ్చు, ముఖ్యంగా అయన సినీ కెరీర్ లో రైజ్ అండ్ ఫాల్ స్ట్రక్చర్ కి తావే లేదు అనుకోవచ్చు. అందుకే నటుడిగా ,స్టార్ హీరో అనే స్థాయి దాటి అయన ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ ని సంపాదించుకున్నాడో దాన్ని హైలైట్ చేస్తూ కథను నడిపించాడు దర్శకుడు.
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాస్ బయలుదేరడం తో మొదలవుతుంది ఎన్టీఆర్ సినీ జీవితం. ముందు అవకాశాలు అందివచ్చినా,ఆ పై కొన్ని ఇబ్బందుల తరువాత వరుస సినిమాల తో అయన ఎదుగుదల ని చూపిస్తూ సాగుతుంది కధనం.యంగ్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ ను చూడటం కాస్త ఇబ్బంది పెట్టినా, ఆయా సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రల పట్ల చూపించిన అంకిత భావం,ఎలాంటి పరిస్థితులలో అయినా తన వ్యక్తిత్వం ని వదులుకోకపోవడం వంటి అంశాలు చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
ఆ క్రమం లో రావణుని పాత్ర చేయాలని పట్టుబట్టి ఆ సినిమా కోసం 20 గంటలు రాయి లాగా ఉండిపోవడం, కొడుకు చనిపోయిన వార్త విన్నా, బాధని దిగమింగుకుని షూటింగ్ పూర్తి చేసి వెళ్లడం వంటి ఎపిసోడ్స్ కదిలిస్తాయి. అలాగే ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడి గా కనిపించే సన్నివేశానికి మంచి ఎలివేషన్ ప్లాన్ చేసుకున్నారు. ఆ సన్నివేశం లో సహనటుల నటన తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇంపాక్ట్ తెప్పించాలని చూసారు కానీ అంత అద్భుతం అనేంతగా ఆ సన్నివేశం తెరకెక్కలేదు. కేవలం ఈ సన్నివేశం కాక సినిమా లో చాలా చోట్ల ఎన్టీఆర్ "దేవుడు" అనే ఇమేజ్ కాస్త బలవంతంగా రుద్దినట్టు అనిపిస్తుంది.
ఇక సెకండాఫ్ లో తెర వెనుక ఎన్టీఆర్ జీవితాన్ని దర్శకుడు టచ్ చేసినపుడు మాత్రం చాలా వరకు ఆకట్టుకుంటాడు. ఎన్టీఆర్ కి అయన భార్య బసవ తారకం మధ్య వచ్చే సన్నివేశాల తో పాటు ఏఎన్నార్ తో ఆయనకి ఉన్న అనుభందం చూపించే సన్నివేశాలు బాగున్నాయి. ఎమర్జెన్సీ సమయం లో తన సినిమా ప్రింట్స్ ను ల్యాబ్ నుండి తెచ్చే సన్నివేశం సినిమా హీరో కి సినిమా రేంజ్ లో ఎలివేషన్ అన్న తరహా లో ఉండి అలరిస్తుంది. తన కూతురి వయసు హీరోయిన్ ల తో ఆడి పాడటం ఏంటి అన్న కుటుంబం విమర్శల కు ఆయన జవాబు ఇవ్వడం,ఆ పై యువ హీరోల తాకిడి తట్టుకోలేక చల్లబడమనే విసుర్లకు దీటు గా దాన వీర శూర కర్ణ సినిమా తీయడం వంటి సన్నివేశాలు కూడా బాగా వచ్చాయి.
తరువాత సమాజం లో రాజకీయ పరిస్థితుల ప్రజల బాధలు పాడడం గమనించి ఏదో చేయాలనీ ఎన్టీఆర్ సంకల్పించడం, పార్టీ అనౌన్స్ చేయడం తో సినిమా ముగుస్తుంది. ఓవరాల్ గా బాలకృష్ణ ,దర్శకుడు క్రిష్ ప్రయత్నం అభినందించదగ్గదే అయినా, ముందుగా చెప్పుకున్నట్టు ఎన్టీఆర్ లార్జర్ థాన్ లైఫ్ ఇమేజ్ ని మరింత పకడ్బందీ గా చూపించడం మీద శ్రద్ధ వహించి ఉంటే ఆ ప్రయత్నానికి మరింత సార్ధకత చేకూరేది.
నటుడిగా బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర లో ఒదిగిపోయాడు. పైన చెపుకున్నట్లు మొదట్లో యంగ్ ఏజ్ లో కాస్త ఆడ్ గా అనిపించినా ఆ తరువాత సినిమా ముందుకు సాగే కొద్దీ తనడైన ముద్ర వేశాడు.ముఖ్యంగా సెకండాఫ్ లో ఆయన నటన/స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగున్నాయి. మిగతా నటీనటుల్లో విద్య బాలన్, సుమంత్,కళ్యాణ్ రామ్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, దర్శకుడు క్రిష్,సాయి మాధవ్ బుర్రా తదితరులు అందరు ఆయా పాత్రలకు సరిపోయారు.
రేటింగ్: 60/100
0 comments:
Post a Comment