కథ:
అర్జున్ (నిఖిల్) చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడి,పెళ్లికి కూడా సిద్ధమవుతాడు. కానీ పెళ్లి రోజు ఆ అమ్మాయి చెప్పిన చోటికి రాదు. తర్వాత ఆమె అతడికి కనిపించదు. ఇలా జరిగిన నాలుగేళ్లకు దయ్యం పట్టిన తన స్నేహితుడి చికిత్స కోసం కేరళకు వెళ్లిన అర్జున్ కి అక్కడే అమల (హెబ్బా పటేట్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మూడు రోజుల ప్రయాణంలో ఇద్దరూ దగ్గరవుతారు. కానీ మరుసటి రోజు ఆ అమ్మాయి హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మళ్లీ హైదరాబాద్ వచ్చాక అదే అమ్మాయిని కలిస్తే తన పేరు నిత్య అని చెబుతుంది. అర్జున్ అంటే ఎవరో తెలియట్లే మాట్లాడుతుంది. మరి ఆమె అలా ఎందుకు చెబుతుంది.. ఈమె నిత్య అయితే.. అమల ఎవరు? అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:
ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆ తరహా హారర్ కామెడీ సినిమాలు చాలానే వచ్చాయి ,కొన్ని సక్సెస్ ఐతే కొన్ని ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. అదే కోవలో వచ్చిన మరో సినిమానే ఎక్కడికి పోతావు చిన్నవాడా. చిన్నదైనా చక్కని ప్రేమకథ చుట్టూ తగిన మలుపులతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు . హీరో ప్రేమ లో విఫలమయ్యే ఎపిసోడ్ తో మొదలైన ఫస్టాఫ్,సీన్ కేరళకి షిఫ్ట్ అయ్యాక కాస్త తడబడ్డా సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అవడం తో నిలబడింది. ఐతే హీరోయిన్ కనిపించకుండా పోయే సన్నివేశం తో కధనం ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ వద్ద దిమ్మతిరిగే ట్విస్ట్ సెకండాఫ్ మీద మరింత ఆసక్తిని రేపుతుంది. సెకండాఫ్ మొదట్లో రొటీన్ హారర్ కామెడీ బాట పట్టినా,హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ అమల వల్ల ఇబ్బందులు పడే సన్నివేశాలు నవ్విస్తాయి. అలాగే ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఇరుక్కుపోయిన హీరో పరిస్థితి ని వివరిస్తూ వచ్చే కామెడీ/సాడ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. సరిగ్గా ఇంక కధలో చెప్పుకోవడానికేమి లేదు అనుకునే టైం కి దర్శకుడు మరో ట్విస్ట్ ఇచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అమల పాత్ర వెనుక ఉన్న నేపధ్యం మొత్తం తెలిసాక మొత్తం సినిమా ఒక కొలిక్కి వస్తుంది. ఆ తరువాత క్లైమాక్స్ లో జరిగే తంతు తెలిసిందే అయినా, ఆ ఎపిసోడ్ మంచి ఫీల్ నే రాబట్టుకుంది. ఐతే అంతదాకా ఉన్న ఫీల్ ని తగ్గించేలా టిపికల్ థ్రిల్లర్/హారర్ సినిమా తరహా లో వచ్చే ముగింపు సన్నివేశం అంతగా ఆకట్టుకోదు. మొత్తానికి తెలిసిన కధనే కాస్త కొత్త బ్యాక్ డ్రాప్ లో,వీలయినంత ఎంటర్టైన్ చేసాడు దర్శకుడు వీఐ ఆనంద్.
నటీనటులు:
అర్జున్ పాత్రలో నిఖిల్ నటన బాగుంది,కధలో ఉన్న నేపధ్యానికి తగినట్టు అతను చూపించిన వేరియేషన్ ఆకట్టుకుంటుంది. అమల పాత్రలో నందిత శ్వేత పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది,ఆమె నటన కూడా చాలా బాగుంది. సినిమా చూసిన తరువాత ఖచ్చితంగా గుర్తుండిపోయే పాత్ర ఆమెదే. హేబా పటేల్ కి మంచి స్క్రీన్ టైం దక్కింది, తన నటన కూడా బాగానే ఉంది. అవికా గోర్ పాత్ర చిన్నదే అయినా చాలా కీలకమయినది. వెన్నెల కిశోర్, సత్య ,సుదర్శన్ వీలైనంత నవ్వించారు. అన్నపూర్ణ,తణికెళ్ళ భరణి ,రాజా రవీంద్ర .. తదితరులు ఒకే.
ఇతర సాంకేతిక వర్గం :
అబ్బూరి రవి మాటలు బాగానే ఉన్నాయి, కెమెరా వర్క్ బాగుంది, ఎడిటింగ్ కూడా. శేఖర్ చంద్ర సంగీతం లో పాటలు పర్వాలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా కి బాగా ప్లస్ అయింది.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment