చిత్రం: ‘జయమ్ము నిశ్చయమ్మురా’
నటీనటులు: శ్రీనివాసరెడ్డి - పూర్ణ - రవి వర్మ - శ్రీ విష్ణు - కృష్ణ భగవాన్ - ప్రవీణ్ - పోసాని కృష్ణమురళి - ప్రభాస్ శీను - రఘు కారుమంచి - జోగి బ్రదర్స్ తదితరులు
సంగీతం: రవిచంద్ర
నేపథ్య సంగీతం: కార్తీక్ రాడ్రిగెజ్
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
స్క్రీన్ ప్లే: శివరాజ్ కనుమూరి - పరమ్
నిర్మాతలు: శివరాజ్ కనుమూరి - సతీష్ కనుమూరి
రచన - దర్శకత్వం: శివరాజ్ కనుమూరి
కథ:
సర్వేష్ అలియాస్ సర్వమంగళం (శ్రీనివాసరెడ్డి) కరీంనగర్లో ఓ పేద చేనేత కుటుంబానికి చెందిన కుర్రాడు. పీజీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అతడికి ఆత్మవిశ్వాసం బాగా తక్కువ. జాతకాల పిచ్చి బాగా ఉంటుంది. తన గురువు చెప్పినట్లు చాదస్తంగా నడుచుకుంటుంటాడు. తనకు గ్రూప్-2లో ఉద్యోగం వస్తే అది కూడా గురువు పుణ్యమే అనుకుంటాడు. అతడి తొలి పోస్టింగ్ కాకినాడలో వస్తుంది. ఐతే ఇంటిదగ్గర ఒంటరిగా ఉన్న తల్లి కోసం సాధ్యమైనంత త్వరగా బదిలీ చేయించుకుని రావాలనుకుంటాడు. తన ఆఫీస్ పక్కనే ‘మీసేవ’లో పని చేసే రాణి ని పెళ్లి చేసుకుంటే బదిలీ అవుతుందన్న గురువు మాటను నమ్మి తనను మెప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు సర్వమంగళం. మరి అతడి ప్రయత్నాలు ఫలించాయా.. రాణి అతణ్ని ప్రేమించిందా లేదా.. అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:
'దేశవాళీ వినోదం' అనే నినాదం తో ఆకట్టుకునే ప్రచారం తో వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చాలా వరకు ఆ వాతావరణాన్ని ప్రతిబింబించింది. మామూలు కధ చుట్టూ వివిధ రకాల పాత్రల ద్వారా వినోదం అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఐతే ఈ క్రమంలో కథను,పాత్రలను ఎస్టాబ్లిష్ చేసేందుకు కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడు. హీరో పరిచయ సన్నివేశం నుండి కధనం నెమ్మదిగానే సాగుతుంది. ఒక్కో పాత్ర పరిచయం అయ్యే కొద్దీ ఆసక్తిగానే అనిపించినా కధ ముందుకు సాగకపోవడం వలన కాస్త అసహనంగా అనిపిస్తుంది. ఐతే గవర్నమెంట్ ఆఫీస్ నేపధ్యం లో వచ్చే కామెడీ సన్నివేశాలు, అలాగే శ్రీ విష్ణు,పూర్ణ తో హీరో రెస్టారెంట్ కి వెళ్లే ఎపిసోడ్ నవ్విస్తాయి. ఫస్టాఫ్ ఒకానొక ఊహించదగ్గ ట్విస్ట్ తో ముగుస్తుంది . సెకండాఫ్ లో ఎప్పుడైతే హీరో తన మూఢనమ్మకాలని వదిలి ఆత్మవిశ్వాసం బాట పడతాడో,అప్పటినుంచి కధనం కూడా ఊపందుకుంటుంది. హీరో ప్రేమకథ లో జరిగే వ్యవహారం అంతా తెలిసిందే అయినా ఆకట్టుకుంటుంది.హీరోయిన్ కి ధైర్యం చెప్పి ఆమెని లక్ష్యం దిశగా నడిపించే సన్నివేశాలు బాగున్నాయి,ఇక ప్రభాస్ శ్రీను 'బైక్ ఎపిసోడ్', కృష్ణభగవాన్ 'మంగళవారం వీక్‌నెస్' పాయింట్ల మీద కామెడీ కూడా బాగానే పండింది.అలాగే తనకు ఉన్న సమస్యలని హీరో ఎదుర్కునే క్రమం లో రవివర్మ తో కోతి బొమ్మ సన్నివేశం చాలా బాగా పండింది. ఐతే ఆ తరువాత వచ్చే సంతకం పెట్టించుకునే ఎపిసోడ్ ఇంకా బలంగా ఉండాల్సింది. ఇక క్లైమాక్స్ వద్ద పోసాని/ప్రవీణ్ ట్రాక్ ని పొడిగించి అనవసరంగా ఆ ఎపిసోడ్ ని సాగదీశాడు దర్శకుడు. మొత్తానికి ఎంచుకున్నది పాత కధే అయినా తెరకెక్కించడం లో దర్శకుడు చాలా వరకు సఫలమయ్యాడు. 'అత్తారింటికి దారేది' పోస్టర్ల నేపథ్యంలో ప్రేమకథని నడిపించడం వంటి కమర్షియల్ ట్రిక్స్ తో పాటు సహజమైన పాత్రల ద్వారా వినోదం అందించడం లో అతని ప్రతిభ కనిపిస్తుంది.ఐతే కధనం మీద మరింత దృష్టి పెట్టి,అనవసర సన్నివేశాలు తొలగించి ఉంటే మరింత బాగుండేది.
నటీనటులు:
సర్వ మంగళం పాత్రలో శ్రీనివాస రెడ్డి నటన చాలా సహజంగా ఉంది, ఒక నటుడిగా తను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పూర్ణ ఆ పాత్రకు సరిపోయింది, నటన కూడా బాగానే ఉంది. విలన్ పాత్రలో రవివర్మ ఆకట్టుకున్నాడు. శ్రీ విష్ణు కూడా బాగానే చేశాడు కానీ అతని పాత్రకు సరైన ముగింపు లేదు,కృష్ణ భగవాన్, ప్రవీణ్,జోగి బ్రదర్స్,పోసాని వీలైనంత నవ్వించారు. అలాగే ప్రభాస్ శ్రీను కూడా.
ఇతర సాంకేతిక వర్గం:
కెమెరా వర్క్ ఆహ్లాదంగా చాలా బాగుంది, కాకినాడ పరిసర ప్రాంతాలని బాగా చూపించారు. రవిచంద్ర పాటలు బాగానే ఉన్నాయి, సినిమా ప్రచారం లో భాగంగా పాపులర్ అయిన ఓ రంగుల చిలకా పాటకి విశేష స్పందన లభించింది. నేపథ్య సంగీతం కూడా బాగుంది.
రేటింగ్: 6/10
Very nice movie.Karimnagar to Kakinada - 2 Telugu States joined by Godavari River and finally joining sea. This is very subtle but impressive background.
ReplyDeleteThe story is good covering very nicely love,superstition and corruption.
Srinivasa Reddy has done commendable job as a hero devoid of violence and over action.