కథ:
ఎంబీఏ పూర్తి చేసి స్నేహితులతో సరదాగా గడిపేస్తున్న ఓ కుర్రాడు.. తన ఇంటికి వచ్చిన చెల్లెలి స్నేహితురాల్ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తర్వాత తన ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ గా దిగడంతో తనతో అతడికి స్నేహం కుదురుతుంది. కొన్నాళ్లకు ఆ స్నేహం చిక్కబడుతుంది. ఇద్దరూ కలిసి ఓ ట్రిప్ కూడా వేస్తారు. ఆ ఇద్దరూ మరింత దగ్గరయ్యే తరుణంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ పరిణామంతో వాళ్లిద్దరి జీవితాల్లో అలజడి మొదలవుతుంది. ఇంతకీ ఈ అలజడికి కారణమేంటి.. ఆ అమ్మాయి ద్వారా తనకు ఎదురైన సమస్యను ఆ కుర్రాడు ఎలా పరిష్కరించుకున్నాడు అన్నది మిగతా కథ.
కధనం-విశ్లేషణ:
ప్రేమకథ అయినా, యాక్షన్ కధ అయినా తెరకెక్కించడం లో తనదైన ముద్ర వేస్తాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఈసారి ఆ రెండు జానర్స్ ని మిక్స్ చేస్తూ తీసిన సినిమానే "సాహసం శ్వాసగా సాగిపో". హీరో నేపధ్యం ,హీరోయిన్ ని కలవడం వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అన్నిట్లో గౌతమ్ మార్క్ కనిపిస్తుంది. ఈ ట్రాక్ మొత్తం మంచి ఫీల్ తో సాగుతుంది. లీడ్ పెయిర్ నటన,విజువల్స్,గౌతమ్ టేకింగ్ కి తోడు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం మరింత కనువిందు చేస్తుంది. గంట లోపే 5 పాటలు వచ్చినా అంత గా ఇబ్బంది అనిపించదు. ముఖ్యంగా వెళ్ళిపోమాకే సాంగ్ ని కధనం లో బ్లెండ్ చేసిన తీరు అద్భుతం. ఈ పాట తరువాత కధనం ఒక్కసారిగా యూ టుర్న్ తీసుకుంటుంది. ఈ యాక్షన్ పార్ట్ సెటప్ రియలిస్టిక్ గానే ఉంటుంది. ఐతే దాన్ని ఆసక్తికరంగా నడిపించడం లో గౌతమ్ సక్సెస్ అవలేదు. హాస్పిటల్ లో హీరో ఛార్జ్ తీసుకునే దగ్గరనుంచి ,విలన్స్ అదే పని గా రావడం ఎటాక్ చేయడం వంటి సన్నివేశాలు రిపీట్ అవుతాయి. అంత సడెన్ గా హీరో/హీరోయిన్ ల జీవితం మారిపోయింది అనే విషయం తెలుస్తూనే ఉన్నా కధనం లో నిలకడ లేక ఉండాల్సిన డెప్త్ లోపించింది. ఇంక భయపడను అని హీరో ఫిక్స్ అయి వెనక్కి వచ్చిన తరువాత అక్కడే సస్పెన్స్ కి తెరదించకుండా అనవసరంగా కధనాన్ని పొడిగించాడు గౌతమ్. క్లైమాక్స్ కి ముందు వచ్చే ట్విస్ట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహా లో ఉంది , అసలు సస్పెన్స్ రివీల్ అయ్యే సన్నివేశం సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. విలన్స్ పాత్రలు, వాళ్ళ మోటివ్ బలంగా లేకపోవడం తో ఆ ఎపిసోడ్ పూర్తిగా తేలిపోయింది. చివరి అరగంట ని సరిగ్గా హేండిల్ చేసి ఉంటే బాగుండేది.
నటీనటులు:
నాగ చైతన్య మరోసారి ఆకట్టుకున్నాడు . సరదాగా ఉండే కుర్రాడి లా,ప్రేమికుడి లా, అలాగే పరిస్థితులకి ఎదురు తిరిగే సన్నివేశాల్లో కూడా రాణించాడు. మంజిమ మోహన్ బాగుంది,నటన కూడా. హీరో ఫ్రెండ్ రోల్ లో రాకేందు మౌళి బాగానే చేసాడు, బాబా సెహగల్ నటనకు వంక పెట్టడానికి లేదు కానీ వేరే తెలిసిన నటుడైతే ఆ పాత్ర మరింత రక్తికట్టేది. డానియెల్ బాలాజీ,తదితరులు ఒకే.
ఇతర సాంకేతిక వర్గం:
కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పరవాలేదు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం సినిమా కి బాగా ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి అలాగే లవ్ ట్రాక్,యాక్షన్/సీరియస్ సన్నివేశాలకు అతనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
రేటింగ్: 5.75/10
0 comments:
Post a Comment