కధ:
ఓ తల్లి తన ప్రాణం పణంగా పెట్టి కాపాడిన బిడ్డకు శివుడు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది మరో తల్లి. ఆ శివుడు (ప్రభాస్) పెరిగి పెద్దవుతూ అనేక విన్యాసాలు చేస్తుంటాడు. ఓ జలపాతం కింద గూడెంలో ఉండే శివుడు.. ఆ జలపాతం వచ్చే కొండపైన ఏముందో తెలుసుకోవాలని చిన్నప్పట్నుంచి ప్రయత్నిస్తుంటాడు. అతను యుక్త వయసుకు వచ్చాక ఓ ఊహాసుందరి స్ఫూర్తితో ఎట్టకేలకు పైకి ఎక్కేస్తాడు. అతడి ఊహాసుందరి అవంతిక (తమన్నా).. భల్లాలదేవుడు (రానా దగ్గుబాటి) పాలిస్తున్న మహిష్మతి రాజ్యంలో బందీగా ఉన్న దేవసేన (అనుష్క)ను విడిపించడానికి పోరాడుతుంటుంది. అవంతికను ప్రేమలోకి దింపిన శివుడు.. ఆమె కోసం దేవసేనను విడిపించడానికి మహిష్మతికి వెళ్తాడు. ఆ క్రమంలో అతను ఎదురుకున్న పరిస్థితులు ,తెలుసుకున్న నిజాలేంటి అనేది మిగతా కధ.
కథనం, విశ్లేషణ: బాహుబలి మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్నీ కావు, మామూలుగానే రాజమౌళి సినిమాలంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే రాజమౌళి కెరీర్ లో వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే బాహుబలి మరో ఎత్తు.
చిత్ర ప్రారంభ సన్నివేశం చాలా బాగుంది, ఆ ఒక్క సన్నివేశం తోనే కధేంటో ఒక అంచనాకి వచ్చేలా చేసాడు. ఆ తరువాత శివుడి పాత్ర పరిచయ సన్నివేశాలు, కొండ పైకి ఎక్కాలనే అతని ఆరాటానికి తమన్నా తో లవ్ ట్రాక్ కి లింక్ పెట్టి ఆ ట్రాక్ ని తొందరగానే ముగించి కధలోకి వచ్చేసాడు. అప్పటివరకు కధనంలో అక్కడక్కడా హెచ్చుతగ్గులు ఉన్నా శివుడు అవంతికకి మాటిచ్చిన సన్నివేశం నుండి ఊపందుకుంటుంది. ఆ ఊపుని కొనసాగిస్తూనే వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ మరింత ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో శివుడు- కట్టప్ప మధ్య వచ్చే ఎపిసోడ్ అద్భుతంగా ఉండడమే కాక ఫ్లాష్ బ్యాక్ కి మంచి లీడ్ గా కుదిరింది. ఫ్లాష్ బ్యాక్ ని శివగామి పాత్ర పరిచయ సన్నివేశం నుండి చివరివరకు బిగిసడలకుండా నడిపాడు. ముఖ్యంగా చివర్లో దాదాపు అరగంట పాటు సాగిన యుద్ధ సన్నివేశాలు చాల బాగున్నాయి,కళ్ళు చెదిరేలా ఉండడం తో పాటు ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి ఆ ఎపిసోడ్ లో . అయితే రెండో భాగం పై ఆసక్తి ఉండాలనే ఉద్దేశం తో ఒక ట్విస్ట్ తో హటాత్తుగా సినిమాని ముగించడం అందరికీ నచ్చకపోవచ్చు. మొత్తానికి కొన్ని చోట్ల పట్టు తప్పినా బాహుబలి ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంలో రాజమౌళి సఫలమయ్యాడు అనే చెప్పాలి.
నటీనటులు: శివుడు, బాహుబలి గా రెండు పాత్రలని ప్రభాస్ సమర్ధవంతంగా పోషించాడు. రానా కి తక్కువ స్కోప్ ఉన్నా ఆకట్టుకున్నాడు. రమ్యకృష్ణ,సత్యరాజ్ తమ నటనతో ఆయా పాత్రలనే కాక సినిమాని నిలబెట్టారనడం లో సందేహం లేదు. అనుష్క ది మరీ చిన్న పాత్ర, కట్టప్ప తో ఉన్న ఒకే ఒక్క ఎమోషనల్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో తన నటన బాగుంది. కళ్ళు చెదిరే అందగత్తె పాత్రలో తమన్నా సరిపోయింది ,నటన కూడా పరవాలేదు కానీ, పోరాట సన్నివేశాల్లో ఆమె ఎక్ష్‌ప్రెషన్స్ ,బాడీ లాంగ్వేజ్ మరీ తెచ్చిపెట్టుకున్న తీరులో ఉన్నాయి . రోహిణి, మిగతా నటీనటులు పరవాలేదు.
సాంకేతికవర్గం: మాటలు పరవాలేదు, కేమెరా వర్క్ కూడా బాగుంది. కీరవాణి సంగీతం లో పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఓకే. అయితే బాహుబలి సినిమా కి తమ బెస్ట్ ఔట్పుట్ ఇచ్చింది మాత్రం ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ విభాగాలు అనే చెప్పాలి.
రేటింగ్: 7.5/10
0 comments:
Post a Comment