చిత్రం : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)
నటీనటులు: నాని - సాయి పల్లవి - భూమిక - విజయ్ వర్మ - రాజీవ్ కనకాల - నరేష్ - ఆమని - ప్రియదర్శి - రచ్చ రవి - పవిత్ర లోకేష్ - శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
మాటలు: మామిడాల తిరుపతి - శ్రీకాంత్
నిర్మాతలు: దిల్ రాజు - శిరీష్ - లక్ష్మణ్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వేణు శ్రీరామ్
కథ:
చిన్నపుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన నాని (నాని) ని అతడి అన్నయ్య (రాజీవ్ కనకాల) అన్నీ తానై పెంచుతాడు. ఇద్దరూ అన్నదమ్ముల్లా కాక మంచి స్నేహితుల్లా ప్రతి చిన్న సంతోషాన్ని పంచుకుంటూ ఆనందంగా గడుపుతుంటారు. ఐతే తన అన్నయ్య పెళ్లి చేసుకున్నాక ఆ ఆనందానికి నాని దూరమవుతాడు. తన వదిన జ్యోతి (భూమిక) వల్లే అన్నయ్యకు తనకు దూరం పెరిగిందని ఆమెను అపార్ధం చేసుకుంటాడు నాని. ఉద్యోగరీత్యా జ్యోతి వరంగల్ కు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంగా నే అయినా అన్నయ్య కోరిక మేరకు నాని కూడా ఆమె వెంట వెళ్తాడు . అనుకోని పరిస్థితుల్లో జ్యోతి , శివ (విజయ్ వర్మ) అనే రౌడీ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ప్రమాదం నుండి నాని ఆమెను కాపాడాడా లేదా అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:
నాన్న/అన్నయ్య లేదా వదిన...కుటుంబం లో ఎవరో ఒకరు నిజాయతీ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం..హీరో అన్ని అడ్డంకులు తొలగించి వాళ్ళకి ఆపద రాకుండా చూసుకోవడం. ఇలాంటి కథతో చాలా సినిమాలే వచ్చాయి. ఐతే కాస్త హీరోయిజం టచ్ ఉన్న కథలో నాని ఉండడం ఇదే మొదటిసారి.
ఫస్టాఫ్ లో వదిన తో ఉంటూ నాని పడే చిన్న సైజు టార్చర్ చుట్టూ అల్లుకున్న కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అలాగే నాని- సాయి పల్లవి లవ్ ట్రాక్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక సరిగ్గా హీరో వదిన మంచితనం తెలుసుకునే టైం కి విలన్ సీన్ లో కి ఎంటర్ అయ్యే సెటప్ బాగా ప్లాన్ చేసుకున్నా, హీరో ఎలివేషన్ ఎఫెక్ట్ వచ్చే లోపే కట్ చేసినట్టు ఉంటుంది ఇంటర్వెల్ ఎపిసోడ్. ఐతే సెకండాఫ్ లో హీరో-విలన్ మధ్య డీల్ కుదిరే సీన్ ఆకట్టుకుంటుంది. అంతవరకు మంచి బిల్డప్ ఉన్న విలన్ పాత్ర ఆ తరువాత మాత్రం తేలిపోతుంది. హీరో ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు అతను చేసే ప్రయత్నాలు అబ్బో అనిపించవు. కేవలం ఒకసారి వాళ్ళని హీరో అడ్డుకున్నందుకే విలన్ గ్యాంగ్ వచ్చి వాడు ఉండగా ఏమి చేయలేము అనడం తోటే ఇక ముందు గేమ్ ఎలా ఉండబోతుంది అన్న ఇంటరెస్ట్ ని కిల్ చేసేస్తుంది.
క్లైమాక్స్ వరకు విలన్ దెబ్బ సరిగా పడకూడదు అన్న తరహాలో కధనం నడవడం తో హీరో చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది.
క్లైమాక్స్ లో రొటీన్ గా ఫైట్ తో కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేసారు కానీ అది క్లైమాక్స్ ని పొడిగించిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక మధ్యలో హీరో ని హీరోయిన్ అపార్ధం చేసుకోవడం వంటి సన్నివేశాలు అనవసరం. మెయిన్ లింక్ వదిన క్యారెక్టర్ తో ఉన్నపుడు మధ్యలో ఈ మెలోడ్రామా లేకుండా ముందే హీరోయిన్ ని కూడా ఆ ప్లాన్ లో భాగంగా చేసుకుంటే బాగుండేది.
ఫస్టాఫ్ లో ఎంటర్టైన్మెంట్ పార్ట్ వరకు సాఫీ గానే హ్యాండిల్ చేసిన దర్శకుడు. అసలు కథలోకి ప్రవేశించాక అంతే ఆసక్తికరంగా కధనాన్ని నడిపించడం లో అంతగా సక్సెస్ అవలేదు. సెకండాఫ్ లో అక్కడక్కడా నాని తన టైమింగ్ తో నిలబెట్టిన సన్నివేశాలు మినహా చెప్పుకోదగ్గ సన్నివేశాలేమి లేవు. వదిన పట్ల హీరో ప్రవర్తన మారడానికి చక్కని సన్నివేశం లీడ్ గా రాసుకున్న దర్శకుడు,ఆమెను కాపాడడానికి అంత వేదన పడ్డ హీరో ని వదిన అర్ధం చేసుకొనే సన్నివేశం మాత్రం అత్యంత పేలవంగా తెరకెక్కించాడు.మంచి ఉద్దేశానికి తోడు బలమైన కధనం తోడై ఉంటే ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి ఆర్డినరీ ఔట్పుట్ ని దాటే వాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా మామూలు గా ఉంది. పాటలు అంతంత మాత్రం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఒకే.
నాని ఎప్పటిలానే సహజంగా నటించి మెప్పించాడు. సాయి పల్లవి కి అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కకపోయినా తన ప్రెజన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. భూమిక పేరుకే ముఖ్య పాత్ర.. కానీ చేయడానికి ఏమి లేదు సీరియస్ గా చూడడం తప్ప.. ఆమె క్యారెక్టర్ ని సరిగా తీర్చిదిద్దలేదు దర్శకుడు. విలన్ గా విజయ్ వర్మ బాగానే చేసాడు. ప్రియదర్శి కామెడీ పరవాలేదు. రాజీవ్ కనకాల.. నరేష్.. ఆమని.. శుభలేఖ సుధాకర్.. పవిత్రా లోకేష్ తదితరులు ఒకే.
రేటింగ్: 5/10
0 comments:
Post a Comment