చిత్రం : ‘జై లవకుశ’
నటీనటులు: ఎన్టీఆర్ - రాశి ఖన్నా - నివేదా థామస్ - సాయికుమార్ - పవిత్ర లోకేష్ - పోసాని కృష్ణమురళి - ప్రవీణ్ - ప్రదీప్ రావత్ - బ్రహ్మాజీ - సత్య తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
స్క్రీన్ ప్లే: కోన వెంకట్-చక్రవర్తి
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
కథ - మాటలు - దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర (బాబీ)
కథ:
జై.. లవ.. కుశ.. ముగ్గురు సోదరులు. అందులో జైకి నత్తి ఉంటుంది. ఆ లోపాన్ని చూపించి ఎగతాళి చేస్తూ తమ్ముళ్లిద్దరూ అన్నపై వివక్ష చూపిస్తారు. వీళ్ల మావయ్య జైని మరింతగా అవమానాల పాలు చేస్తుంటాడు. దీంతో ముందు తమ్ముళ్లిద్దరిపై ఎంతో ప్రేమ చూపించిన జై.. ఆ తర్వాత వాళ్లపై కోపం పెంచుకుంటాడు. వాళ్లను నాశనం చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు అన్నదమ్ములూ విడిపోయి వేర్వేరు చోట్ల పెరుగుతారు. లవ బాగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ అయితే.. కుశ దొంగతా మారతాడు. ఓ సందర్భంలో వీళ్లిద్దరూ అనుకోకుండా కలుస్తారు. సమస్యల్లో ఉన్న వీళ్లిద్దరూ వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఉండగా.. లవ ప్రేయసి.. కుశకు సంబంధించిన డబ్బు కనిపించకుండా పోతాయి. దాని వెనుక సూత్రధారి జై అని తెలుస్తుంది. ఇంతకీ జై ఏమయ్యాడు.. ఎక్కడ ఎలా పెరిగాడు.. లవ ప్రేయసిని.. కుశ డబ్బును అతనెందుకు తీసుకెళ్లాడు.. చివరికి ఈ అన్నదమ్ముల కథ ఎక్కడి దాకా వెళ్లింది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హీరో అన్నదమ్ములు గా డబల్ యాక్షన్ , చిన్నపుడు ఇద్దరు విడిపోయి ఒకడు మంచివాడు గా పెరగడం, ఇంకొకడు విలన్ల పంచన చేరడం ... చివరికి మారడం లాంటి కథతో చాలా సినిమాలే వచ్చాయి. కాస్త పాతకాలం కధలా అనిపించే ఈ కధనే ముగ్గురు అన్నదమ్ముల మధ్య సంఘర్షణ నేపధ్యంగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు బాబీ. ఐతే మంచి కధ, ఆసక్తికరమైన పాత్రల సెటప్ ఉండి కూడా సినిమాని అంతే బలంగా తీర్చిదిద్దలేకపోయాడు.
జై లవ కుశ ల బాల్యం చూపిస్తూ ఇంటరెస్టింగ్ గా మొదలైన ఫస్టాఫ్, తరువాత లవ, కుశల పరిచయం తో సాధారణంగా ముందుకు సాగుతుంది. లవ మంచితనం వల్ల సమస్యలు ఎదుర్కోవడం ఆ వ్యవహారం చాలా మామూలుగా ఉంది. కుశ లవ స్థానం లో కి వెళ్లే ఎపిసోడ్ తో కాస్త చలనం వస్తుంది. అలాగే లవ లవ్ ట్రాక్ కూడా పరవాలేదనిపిస్తుంది. కధనం లో పట్టు లేకున్నా అక్కడక్కడా కొన్ని మంచి డైలాగ్స్ , సీన్స్ మీదుగా వెళ్తున్న ఫస్టాఫ్ కి ఇంటర్వెల్ వద్ద జై ఎంట్రీ తోటే ఊపు వస్తుంది. ఆ స్థాయి లో జై పాత్రని తరువాత ఎలివేట్ చేయకపోయినా, అన్నదమ్ముల మధ్య సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఆయా సన్నివేశాల్లో ప్రధాన బలం జై పాత్రే అయినప్పటికీ ,లవ కుశల పాత్రలు కూడా వాటి ఉనికిని చాటుకున్నాయి . రావణ కోటలో ఉండడానికి ముందు అవస్థ పడ్డా తమ అన్నని దక్కించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మరింత బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ప్రీ క్లైమాక్స్ లో సినిమాని నిలబెట్టిన నాటకం ఎపిసోడ్ లాగే మరిన్ని సన్నివేశాలు అన్నదమ్ముల మధ్య ఉండి ఉంటే బాగుండేది.
దానికి తోడు మొత్తం సినిమా మూడు పాత్రల చుట్టే తిరగడం తో మిగతా పాత్రలు ఏ మాత్రం రిజిస్టర్ కావు. హీరోయిన్స్ ని కాస్త పక్కకి పెట్టినా పర్వాలేదు కానీ జై కి ఎదురు నిలిచే విలన్ అంటూ ఎవరు లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. కేవలం క్లైమాక్స్ రొటీన్ ఫైట్ కోసం కాకుండా, అన్నదమ్ముల సంఘర్షణ మధ్యలో విలన్స్ కూడా ఎత్తులు వేసినట్టు చూపించి ఉంటే ఆసక్తికరంగా ఉండేది. తద్వారా ముందుగానే చెప్పుకున్నట్టు మంచి కధకు బలమైన పాత్రలు/కధనం తోడై జై లవ కుశ మంచి అనుభూతిని మిగిల్చేది.
నటీనటులు:
టెంపర్ సినిమా నుండి నటుడి గా ప్రతి సినిమాకు భిన్న పాత్రలను పోషిస్తున్న ఎన్టీఆర్ జై లవ కుశ లో మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. మూడు పాత్రలు వేటికవి ప్రత్యేకమైనవి. అందులో అగ్ర తాంబూలం జై పాత్రకే. విలనిజం తో జై, ఎంటర్టైన్మెంట్ తో కుశ డామినేట్ చేయడం తో కాస్త వెనుకబడ్డ లవ పాత్ర కూడా బాగుంది. సెకండాఫ్ లో అన్నని మార్చాలని, దగ్గరవ్వాలని ప్రయత్నించే సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంది.
రాశి ఖన్నా, నివేశ థామస్ ఉన్నారు అంటే ఉన్నారు అంతే. సాయి కుమార్ పరవాలేదు. పోసాని రొటీన్ తరహా పాత్రకే కాస్త సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. విలన్ గా రోనిత్ రాయ్ చేయడానికేమీ లేదు.
సాంకేతిక వర్గం:
దేవిశ్రీప్రసాద్ సంగీతం పర్వాలేదు.. పాటల్లో రావణా, నీ కళ్ళ లోన బాగున్నాయి, కానీ మిగతా పాటలు అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా/ఎడిటింగ్ వర్క్ ఒకే.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment