చిత్రం : ‘నిన్ను కోరి’
నటీనటులు: నాని - ఆది - నివేదా థామస్ - మురళీ శర్మ - పృథ్వీ - తనికెళ్ల భరణి - సుదర్శన్ - విద్యు తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
స్క్రీన్ ప్లే - కోన వెంకట్
మాటలు: శివ నిర్వాణ - కోన వెంకట్
నిర్మాత: డీవీవీ దానయ్య
కథ - దర్శకత్వం: శివ నిర్వాణ
కథ:
ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమ (నాని) విశాఖపట్నంలో పీహెచ్ డీ చేస్తుంటాడు. అతను తనకు అనుకోకుండా పరిచయమైన పల్లవి (నివేదా థామస్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తుండటంతో భయపడ్డ పల్లవి.. పారిపోయి పెళ్లి చేసుకుందామంటుంది. కానీ జీవితంలో స్థిరపడకుండా పెళ్లి వద్దని పీహెచ్ డీ మీద దృష్టిపెడతాడు ఉమ. ఇంతలో అరుణ్ (ఆది)తో పల్లవికి పెళ్లయిపోతుంది. ఇద్దరూ యుఎస్ వెళ్లిపోతారు. ఐతే ఉమ పల్లవి జ్నాపకాల నుంచి బయటపడలేక తాగుడుకు బానిసవుతాడు. ఇది తెలిసి పల్లవి అతణ్ని మార్చాలనుకుంటుంది. తాను వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నానో చూపించడానికి ఉమను తన ఇంటికే పిలుస్తుంది. మరి అతడి రాకతో ఏం జరిగింది.. అరుణ్ - పల్లవి - ఉమల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
హీరోయిన్ ముందు హీరో ని ప్రేమించి ఆ తరువాత వేరే అతని తో పెళ్లి ఫిక్స్ అయి, చివరికి మళ్ళీ హీరో నే పెళ్లి చేసుకునే కథతో చాలానే సినిమాలు వచ్చాయి. అప్పుడప్పుడు పెళ్లి తరువాత కూడా ప్రేమని గెలుచుకున్న కధలతోనూ కొన్ని సినిమాలు వచ్చాయి.
ఐతే అలాంటి కథకే 'జీవితం మనకెన్నో అవకాశాలని ఇస్తుంది. మనం జీవితానికి ఒక అవకాశమిద్దాం' అన్న థీమ్ తో కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు శివ నిర్వాణ. ఫస్టాఫ్ లో వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఉమా-పల్లవి ల ప్రేమకథ టేకాఫ్ కొంచెం గందరగోళంగా ఉన్నా తరువాత సిట్యుయేషనల్ కామెడీ తో పాటు లీడ్ పెయిర్ నటన కూడా తోడవడంతో సాఫీగా సాగిపోతుంది. వాళ్లిద్దరూ విడిపోయే ఎపిసోడ్ సహజంగా ఉండి ఆకట్టుకుంటుంది. ఐతే ఉమా పరిస్థితి తెలిసి అతని లో మార్పు తేవడానికి పల్లవి అతన్ని తన ఇంటికే పిలవడం అనే పాయింట్ ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. ఎలాగో భగ్న ప్రేమికుడిగా చూపించారు కాబట్టి ఉమా పాత్రే ఏదో సాకుతో వాళ్ళ జీవితం లో కి వచ్చినట్టు చూపించి ఉంటే బాగుండేది ఏమో.
ఐతే భావోద్వేగాలకి అవకాశం బాగా స్కోప్ ఉన్న సెకండాఫ్ ని తెరక్కించడం లో దర్శకుడు తడబడ్డాడు. ముఖ్య పాత్రల మధ్య ఉండాల్సినన్ని బలమయిన సన్నివేశాలు లేవు. ఉమా తాగి వాగుతూ అరుణ్ ని బ్లేమ్ చేసే సీన్ ని బాగా స్టార్ట్ చేసినా తరువాత తేలిపోయింది. ఇక వినోదం కోసం అని మురళి శర్మ, పృథ్వీ ట్రాక్ ని మధ్యలో ఇరికించాడు దర్శకుడు ,అవి పర్వాలేదు అనిపించినా,అసలు కధ ముగించేందుకు సరైన సమయం లేకుండా పోయింది. ప్రీ క్లైమాక్స్ నుండి ఒకేసారి వరసపెట్టి ఎమోషనల్ సీన్స్ వచ్చే క్రమం లో ఉమా- అరుణ్ ల మధ్య కాన్‌ఫ్రంటేషన్ అనుకున్నంత బాగా రాలేదు. ఐతే పల్లవి రియలైజ్ అయ్యే సీన్ బాగుంది,అలాగే చివర్లో నాని బాధని దాచలేక నడుచుకుంటూ వెళ్లే సీన్ కూడా. అలాంటి ఇంపాక్ట్ సెకండాఫ్ మొత్తం ఉండేలా చూసుకుని ఉంటే బాగుండేది. కధలో ఉన్న డెప్త్ ని తగ్గించి ,వినోదం తో కోటింగ్ ఇవ్వాలి అని ప్రయత్నించిన దర్శకుడు సినిమాని మరీ సింపుల్ గా ముగించేశాడు.
నటీనటులు :
నాని ఎప్పటిలాగే సహజ నటన తో ఆకట్టుకుంటాడు. ఐతే సెకండాఫ్ లో ఒకటి రెండు సీన్ లు తప్ప తనకి అంత పరీక్ష పెట్టె సన్నివేశాలేవి లేవు. నివేదా థామస్ పాత్రకి ఇంపార్టెన్స్ ఎక్కువ. దాన్ని వీలైనంత వరకు సద్వినియోగం చేసుకుంది. ఆది కూడా అరుణ్ పాత్రలో బాగా సరిపోయాడు. సుదర్శన్,విద్యురామన్,పృథ్వీ ఉన్నంతలో బాగానే నవ్వించారు. మురళి శర్మ ,తనికెళ్ళ భరణి తదితరులు ఒకే.
సాంకేతిక వర్గం :
డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా వర్కవుట్ అయ్యాయి. కెమెరా వర్క్ బాగుంది. గోపి సుందర్ సంగీతం లో పాటలు బాగున్నాయి, ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండాల్సింది.
రేటింగ్ : 5/10
0 comments:
Post a Comment