కథ :
పరోల్ లో ఉన్న శ్రీను (కార్తి) కోర్టుకి తన సత్ప్రవర్తనను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందులో భాగంగా, అవిటితనంతో ఉన్న కోటీశ్వరుడు విక్రమ్ ఆదిత్య (నాగార్జున) పనిలో చేరతాడు. ఆ తరువాత బలపడిన వీరిద్దరి స్నేహం కథే “ఊపిరి”.
కథనం - విశ్లేషణ:
పాత కధను కొత్తగా చెప్పడం ఒక పద్ధతి, కొత్త కధను అర్ధమయ్యేలా చెప్పడం ఇంకో పద్ధతి. కొన్నిసార్లు కొత్త కధని ఎంచుకున్నా తెలిసిన దారిలో వెళ్తేనే ఆ కధకు న్యాయం చేయగలుగుతారు దర్శకులు. "ఊపిరి" లాంటి కధను తెరకెక్కించడం అంత తేలికయిన విషయమేమీ కాదు, ఈ సినిమా అనౌన్స్ అయినపుడు బృందావనం,ఎవడు లాంటి కమర్షియల్/మాస్ సినిమాలు అందించిన వంశీ పైడిపల్లి ఇలాంటి కధతో వచ్చి ఆకట్టుకుంటాడు అని ఎవరూ ఊహించి ఉండరు. ఐతే ఇంతకుముందే ఎన్నోసార్లు ఇలాంటి ప్రయోగాలతో విజయం అందుకున్న నాగార్జున తోడవడంతో ఆసక్తిని కలిగించింది "ఊపిరి".
డబ్బే సంతోషాన్ని ఇవ్వదని భావించే ఒక బిలియనీర్,డబ్బుంటే చాలు ఎలాగైనా బతికేయచ్చు అని భావించే ఒక దొంగ,పూర్తిగా వేరు వేరు ఆలోచనలు,నేపధ్యాలు ఉన్న ఈ ఇద్దరు ఒకరికొకరు తారసపడడం,తద్వారా ఇద్దరి మధ్య ఏర్పడే బంధాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో,భావోద్వేగాలతో నిండిన ఈ కధకి వీలైనంత వినోదాన్ని జోడించడంలో సఫలమయ్యాడు దర్శకుడు. శీను విక్రమ్ వద్ద పనిలో చేరేటపుడు ఆ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో పడే చిన్న చిన్న పాట్లు బాగా నవ్విస్తాయి. అలాగే వాళ్ళిద్దరూ దగ్గరవడానికి కూడా పెద్ద సమయమేమి తీసుకోలేదు దర్శకుడు. పెయింటింగ్ ఎపిసోడ్ కి సంబంధించిన సన్నివేశాల్లో కామెడీ బాగా పండింది. శీను చెల్లెలు ప్రేమ వ్యవహారం చక్కదిద్దే సన్నివేశాల్లో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది, ఐతే అంత సీరియస్ గా సాగిన ఆ సన్నివేశానికి శీను పాత్ర ‘నేను వెళ్తాను సార్.. అసలే చెల్లి పెళ్లి.. ఖర్చులుంటాయ్.. పెయింటింగ్స్ వేసుకోవాలి’ అనే డైలాగ్ తో ఫన్ని నోట్ లో మంచి హై లో ఎండ్ చేయడం చాలా బాగుంది,సినిమా అంతా దాదాపు ఇదే తరహాలో హ్యుమర్ డోస్ ఇస్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్ టచ్ తో సాగుతుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే విక్రమ్ పుట్టినరోజు వేడుక సన్నివేశం కూడా బాగా నవ్విస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే వినోదం కొంచెం తగ్గడం వలన సెకండాఫ్ కాస్త నెమ్మదిస్తుంది, డ్యాన్సర్ తో విక్రమ్ డేటింగ్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోలేదు. ఐతే అంతకు ముందు ఇఫిల్ టవర్ ని చూడాలి అనుకునే విక్రం తాపత్రయం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, ఆ క్రమంలో వచ్చే చేజ్ ఎపిసోడ్ బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో విక్రమ్-నందిని ల ట్రాక్ ని మంచి ఫీల్ తో ముగించిన దర్శకుడు ఆ తరువాత శీను-విక్రమ్ ల దారులు వేరయ్యే ఎపిసోడ్ ని తొందరగానే స్టార్ట్ చేసి అంతే తొందరగా ముగించాడు. మరింత ఫీల్ ఉండాల్సింది అన్న ఆ లోటుని "ఎపుడు ఒకలా ఉండదు" అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ చాలావరకు పూర్తి చేసింది.ఐతే అదే దర్శకుడు క్లైమాక్స్ లో శీను విక్రమ్ జీవితాన్ని చక్కదిద్దే సన్నివేశాన్ని మాత్రం అనవసరపు డ్రామాలకు పోకుండా సహజంగా ముగింఛి ఆకట్టుకుంటాడు.
నటీనటులు:
ముందుగానే చెప్పుకునట్టు నాగార్జున ఇది వరకే ఎన్నోసార్లు కొత్త తరహా పాత్రలు/సినిమాలు అందించాడు. ఇప్పుడు విక్రమ్ గా మరోసారి మెప్పించాడు, ప్రేమ/భయం గురించి చెప్పే సన్నివేశంలో, ఇఫిల్ టవర్ ఎపిసోడ్ ఆ తరువాత వచ్చే చేజ్ సన్నివేశం లో అద్భుతంగా నటించాడు.నాగార్జునకు ఏమాత్రం తీసిపొని విధంగా శీను పాత్రలో కార్తి ఎంతో సహజంగా నటించాడు, అటు కామెడీతో పాటు ఇటు ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించాడు. తమన్నాది అంతగా ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు,అందంగా ఉంది, ఉన్నంతలో నటన కూడా ఒకే. ప్రకాష్ రాజ్ కి మంచి పాత్రే దక్కింది, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జయసుధ,తనికెళ్ళ భరణి ,శీను చెల్లెలి పాత్ర వేసిన అమ్మాయి బాగా నటించారు.
సాంకేతికవర్గం:
అబ్బూరి రవి మాటలు చాల బాగున్నాయి, ముఖ్యంగా ప్రేమ/భయం గురించి చెప్పే సన్నివేశంలో.పీ ఎస్ వినోద్ కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ కి తగ్గట్టు చాలా రిచ్ గా కనిపించింది. ఇక గోపి సుందర్ సంగీతం లో పాటలు సినిమా కదనలో బాగా ఇమిడిపోయాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది,ఒకట్రెండు సన్నివేశాల్లో తప్ప.
రేటింగ్: 7.5/10
0 comments:
Post a Comment