కథ:
శివాజీ కృష్ణ (మంచు విష్ణు) చదువు పూర్తి చేసి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చూసుకున్న కుర్రాడు. అతడికి అనుకోకుండా అనామిక (ప్రణీత) అనే పెద్దింటి అమ్మాయి పరిచయమవుతుంది. తనను ఓ ప్రమాదం నుంచి కాపాడిన శివాజీ అంటే నచ్చి.. అతడితో డిన్నర్ కు వెళ్తుంది అనామిక. తర్వాత ఇద్దరూ కలిసి అనామిక ఫ్లాట్ కి వస్తారు. ఇంతలో కొంతమంది రౌడీలొచ్చి అనామికను కిడ్నాప్ చేస్తారు. శివాజీ కిడ్నాపర్లను వెంటాడినా ఫలితముండదు. పోలీసులకు చెప్పినా ప్రయోజనముండదు. ఆ తర్వాత శివాజీ నేరుగా తనే స్వయంగా అనామికను కాపాడ్డానికి బయల్దేరతాడు. ఆ క్రమంలో అతడికి విస్మయపరిచే విషయాలు తెలుస్తాయి. దీని వెనుక ఉన్నది ఎవరు ?? శివాజీ.. అనామికను కాపాడి వాళ్ళ ఆట ఎలా కట్టించాడన్నది మిగతా కధ.
కథనం విశ్లేషణ:
'డైనమైట్ ' తమిళ హిట్ సినిమా ' అరిమ నంబి ' రీమేక్. కధలో సస్పెన్స్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి మంచి స్కోప్ ఉంది. ఐతే తమిళ వెర్షన్ నుండి మార్పులు ఎక్కువ చేసారో , లేదా మక్కి కి మక్కి దించినా ఆ ఎఫెక్ట్ ని తీసుకురాలేకపోయారో కానీ విష్ణు,దేవకట్టా సినిమాని సరైన రీతిలో తెరకెక్కించడం లో విఫలమయ్యారు.
సినిమా మొదటి సీన్ నుండే పెద్దగా టైం తీసుకోకుండానే అసలు కధ లోకి ఎంటర్ అయిపోతుంది. హీరో, హీరోయిన్ ఇంట్రో, వాళ్ళిద్దరి పరిచయం వగైరా సన్నివేశాలు పరవాలేదనిపిస్తాయి. హీరోయిన్ కిడ్నాప్ సన్నివేశం నుండి ఒక 15-20 నిముషాలు కధనం చాలా వేగంగా, ఉత్కంట భరితంగా ఉంటుంది. అయితే పోలీస్ ల వల్ల తనకి ఏ రకమైన సహాయం అందదు అని రియలైజ్ అయిన హీరో స్వయంగా రంగం లో కి దిగే సన్నివేశం నుండి ఆ వేగాన్ని కొనసాగించడం లో విఫలమయ్యాడు దర్శకుడు. సినిమాకి ఏ మాత్రం అవసరం లేని,హెల్ప్ అవని యాక్షన్ ఎపిసోడ్ ల చాలా టైం వేస్ట్ చేసాడు. సరైన ఎమోషనల్ లీడ్ సీన్ లేనిదే ఎంత బిల్డప్ ఉన్న ఫైట్ అయినా వర్కవుట్ అవదు. చివరి వరకు అసలు ట్విస్ట్ ఏంటి అనే సస్పెన్స్ దాచిపెట్టాడు కానీ, అంత వరకు సాగే హీరో - విలన్ గ్యాంగ్ మధ్య చేజింగ్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. హీరోయిన్ కిడ్నాప్ అయిన దగ్గరినుంచి చివర్లో విలన్ గుట్టు రట్టు చేసే సన్నివేశం వరకు హీరో ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటాడు కానీ ఏ దశలోనూ ఆ పాత్ర మీద సానుభూతి కానీ అతను గెలవాలి అన్న ఫీలింగ్ కానీ ఏర్పడదు. పైగా మైండ్ గేమ్ ల కి అవకాశం ఉన్నా హీరో ఎలివేషన్ కొరకు అనవసర ఫైట్స్ మీద దృష్టి పెట్టడం మరో మైనస్ గా చెప్పుకోవచ్చు. చివరి అరగంట లో విలన్ ని బోల్తా కొట్టించే ఎపిసోడ్ కాస్త పరవాలేదు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది , పైగా ఆ ఎపిసోడ్ లోనూ అంతవరకూ కనిపించని హీరో సడెన్ గా ఊడిపడ్డట్టు వేగంగా వెళ్తున్న ట్రైన్ లోకి విలన్ ని లాక్కేళ్లిపోవడం వంటి ఫీట్స్ నవ్వు తెప్పిస్తాయి.
నటీనటులు:
విష్ణు పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు కానీ, ఆ కష్టం సినిమాకి ఎందుకు హెల్ప్ అవని ఫైట్స్ కోసం అవడం వల్ల వృధా అయిపోయింది. నటన వరకు ఐతే పరవాలేదు. హీరోయిన్ గా ప్రణీత అంతగా ఆకట్టుకోలేకపోయింది. జెడీ చక్రవర్తి విలన్ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు, ఇంటర్వెల్ ఎపిసోడ్ ,చివర్లో కంట్రోల్ రూం లో మర్డర్ చేసే సన్నివేశం లో అతని నటన చాలా బాగుంది. నాగినీడు కి చిన్నదైనా మంచి పాత్ర లభించింది. ప్రవీణ్, రాజ రవీంద్ర , తదితరులు ఒకే.
సాంకేతిక వర్గం :
డైలాగ్స్ ఇంకా బాగుండాల్సింది, ఒకటి రెండు చోట్ల తప్ప పెద్దగా రిజిస్టర్ అవలేదు. కేమెరా వర్క్ చాలా మామూలుగా కొన్ని చోట్ల పేలవంగా ఉంది . ఎడిటింగ్ ఒకే. పాటలు సినిమాకి అవసరమే లేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదు.
రేటింగ్ : 4.5/10
Bro.. Nuvvu ichina rating apt but oka sequence mention cheyyaledhu. The one where hero diverts the police. Adi baagaa teesaadu kada
ReplyDelete