చిత్రం : ‘నా పేరు సూర్య’
నటీనటులు: అల్లు అర్జున్ - అను ఇమ్మాన్యుయెల్ - అర్జున్ - శరత్ కుమార్ - అనూప్ సింగ్ ఠాకూర్ - నదియా - రావు రమేష్ - బొమన్ ఇరానీ - వెన్నెల కిషోర్ - ప్రదీప్ రావత్ - సాయికుమార్ - లగడపాటి విక్రమ్ - చారుహాసన్ తదితరులు
సంగీతం: విశాల్ - శేఖర్
ఛాయాగ్రహణం: రాజీవ్ రవి
నిర్మాతలు: లగడపాటి శిరీషా శ్రీధర్ - బన్నీ వాస్
రచన - దర్శకత్వం: వక్కంతం వంశీ
కథ:
సూర్య (అల్లు అర్జున్) ఒక సైనికుడు. ఎప్పటికయినా బోర్డర్ కి వెళ్ళి దేశం కోసం పని చేసి ప్రాణత్యాగం చేయాలి అనేది అతని కల. ఐతే కోపాన్ని కంట్రోల్ చేయలేని బలహీనత వల్ల అతను ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకుంటూ ఉంటాడు . అలా ఆవేశం లో చేసిన తప్పు వల్లే అతడిని ఆర్మీ నుండి సస్పెండ్ చేస్తారు . మళ్లీ సైన్యంలో చేరాలంటే.. ప్రొఫెసర్ రామకృష్ణమరాజు (అర్జున్) సంతకం ఇస్తేనే వీలు అవుతుంది అన్న షరతు విధిస్తారు. ఆ పై సూర్య తన కలని నెరవేర్చుకునే క్రమం లో ఎలాంటి పరిస్థితులు/ఇబ్బందులు ఎదురుకున్నాడు అన్నది మిగతా కధ.
కథనం - విశ్లేషణ:
టీజర్, ట్రైలర్ లతో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కాస్త డిఫెరెంట్ గా ఇంటెన్సిటీ ఉన్న సినిమా అనే ఫీలింగ్ క్రియేట్ చేసారు "నా పేరు సూర్య" టీం. సినిమా ఆరంభం కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. పక్కా కమర్షియల్ సినిమా తరహాలో మంచి బిల్డప్ తో హీరో ఇంట్రో సీన్... ఆ సీన్ ని చిన్న ఫ్లాష్ బ్యాక్ తో హీరో క్యారెక్టర్ మీద ఒక బలమైన అంచనాకి వచ్చేలా ఇంటరెస్టింగ్ గా నేరేట్ చేశాడు దర్శకుడు. ఆ తరువాత ఆర్మీ నుండి సస్పెండ్ కావడం.. మళ్ళీ జాయిన్ అవ్వాలి అంటే విధించే షరతు కి.. హీరో కి ఉన్న సమస్య తెలియడం తో ఎం చేస్తాడో అన్న ఆసక్తి కలుగుతుంది. ఐతే ఆ ఆసక్తిని అదే తరహాలో కొనసాగించలేకపోయాడు దర్శకుడు.
ప్రొఫెసర్ తో సెషన్స్ లో భాగంగా వచ్చే హీరో ఫ్లాష్ బ్యాక్ ఏమంత మెప్పించదు. అప్పటి దాకా హీరో క్యారెక్టర్ కి ఇచ్చిన లీడ్ కి ఏ మాత్రం సరిపడని లవ్ ట్రాక్ నిరుత్సాహపరుస్తుంది. టేక్ ఆఫ్ ఏ అంత వీక్ గా ఉన్నపుడు కారణాలు ఏవైనా బ్రేకప్ సీన్ లో ఎంత ఎమోషన్ కి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
ఒక రకంగా ప్రేక్షకుడికి వచ్చే విసుగు హీరోకి వచ్చి ఏంటి ఈ సోది అన్నతరహాలో ప్రొఫెసర్ మీద విరుచుకుపడితే తప్ప కధనం లో ఊపు రాలేదు. 21 రోజులు తన కోపాన్నిఅణుచుకుంటే సంతకం పెడతా అన్న మెలిక తో హీరో కి ఒక గోల్ ఫిక్స్ చేసిన దర్శకుడు, ఆ సన్నివేశం లో హీరోకి ఉన్న కోపానికి కరెక్ట్ గా సరిపోయేలా ఒక ఫైట్ పెట్టి ఆకట్టుకున్నాడు.
ఆ తరువాత ఇటు ఫామిలీ..ఇటు విలన్స్ ట్రాక్ తో హీరో కి ఉండే సన్నివేశాలు ఏవీ అంత ఆసక్తికరంగా లేవు. ఫామిలీ సన్నివేశాల్లో డ్రామా పండకపోగా.. విలన్స్ ట్రాక్ ని చాలా కన్వీనియంట్ గా దారి మళ్లించడం తో హీరో తో పాటు కధనం కూడా వీక్ అయిపోయింది. తనతో తానే యుద్ధం చేస్తానన్న హీరో కి.. ఎక్కడా అంత పెద్ద సమస్య కానీ,అడ్డంకులు కానీ ఎదురవవు. సినిమా ఎక్కడ మొదలయి ఎక్కడికి వెళ్తుంది అన్న అయోమయం లో ఉండగా సాయి కుమార్ ట్రాక్ తో హీరో రియలైజ్ అయ్యే సీన్ బాగానే వర్కవుట్ అయింది. ఇంటర్వెల్ తరహా లోనే హీరో బరస్ట్ అయ్యే టైం కి విలన్స్ తో మళ్ళీ ఒక ఫైట్ తో ఇక సినిమా దారిలోకి వస్తుంది అనుకునే టైం లో అనవసరమైన పాట పెట్టి ఆ మాత్రం ఇంపాక్ట్ ని కూడా చెడగోట్టాడు దర్శకుడు. ఆ తరువాత క్లైమాక్స్ ని కాస్త బిన్నంగా..మెసేజ్ తో ముడిపెట్టాలని చూసినా, ఆ సన్నివేశం కావాల్సిన డెప్త్ టోటల్ గా మిస్ అయింది.
సన్నివేశాల పరంగా అక్కడక్కడా మంచి సీన్స్, డైలాగ్స్ పడ్డా, మొత్తాన్ని కలిపి ఒక ఆసక్తికరమైన సినిమాగా మలచడం లో దర్శకుడు విఫలమయ్యాడు.హీరో కి భిన్నమైన క్యారెక్టర్ రాసుకుని మొత్తం ఆ పాత్ర ఆధారంగా సినిమా ని నడిపిద్దామని చూసినా, కధనం లో,హీరో క్యారెక్టర్ లో కంటిన్యూయిటీ లేకపోవడం తో సీన్స్ అతికించినట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడా బలమైన ముద్ర వేయలేకపోయాడు.
విశాల్-శేఖర్ అందించిన పాటలు పరవాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది.. ముఖ్యంగా హీరో కి కోపం వచ్చినపుడల్లా సైరన్ మోగినట్టు వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుండిపోతుంది.
అల్లు అర్జున్ కి ఖచ్చితంగా ఇది డిఫరెంట్ క్యారెక్టర్ అయినప్పటికీ,తన నటనతో సినిమా మైనస్ లు దాచేంత అవకాశం అతనికి దక్కలేదు. అను ఇమ్మానుయేల్ కి సరైన పాత్రే లేదు. అర్జున్ పాత్రని సరిగా మలచలేదు,అలాగే విలన్ గా శరత్ కుమార్ మంచి బిల్డప్ తో ఎంట్రీ ఇచ్చినా తరువాత ఆ పాత్ర వీక్ అయిపొయింది. చిన్న పాత్రే అయినా సాయి కుమార్ తన నటన తో ఆకట్టుకుంటాడు,అలాగే అతడి కొడుకు గా చేసిన విక్రమ్ లగడపాటి కూడా.వెన్నెల కిశోర్ ఉన్నంతలో కాస్త నవ్వించాడు. బొమన్ ఇరానీ.. రావు రమేష్.. నదియా,అనూప్ సింగ్ ఠాకూర్ తదితరులు ఒకే.
రేటింగ్: 45/100
0 comments:
Post a Comment