బాహుబలి: ది కంక్లూజన్ రివ్యూ


Image result for baahubali the conclusion wallpapers



చిత్రం : ‘బాహుబలి: ది కంక్లూజన్’ 

నటీనటులు: ప్రభాస్ - రానా దగ్గుబాటి - అనుష్క - రమ్యకృష్ణ - సత్యరాజ్ - నాజర్ - సుబ్బరాజు - తమన్నా తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్
మాటలు: విజయ్ కుమార్ - అజయ్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్
వీఎఫెక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి



కథ: 

కాలకేయులతో యుద్ధంలో విజయానంతరం బాహుబలిని శివగామి మహిష్మతికి రాజుగా ప్రకటించాక.. పట్టాభిషేకానికి గడువు సమీపించేలోపు అమ్మ ఆదేశం మేరకు దేశాటనకు బయల్దేరతాడు బాహుబలి. మరోవైపు సింహాసనం తనకు దక్కలేదన్న అక్కసుతో రగిలిపోతున్న భల్లాలదేవుడు బాహుబలిని ఎలా దెబ్బ తీయాలా అని ఆలోచిస్తుంటాడు. అదును చూసి బాహుబలి కి తన తల్లికి మనస్ఫర్ధలు పెరిగే దిశగా పన్నాగం పన్నుతాడు. అతని పధకం ఫలించిందా ... అసలు కట్టప్ప బాహుబలిని చంపడం నిజమేనా.. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. తన నేపథ్యం గురించి తెలుసుకున్నాక శివుడు ఏం చేశాడు.. భల్లాలను బతికుండగానే చితి మీద పడుకోబెట్టి కాల్చాలన్న తన తల్లి కోరికను అతను నెరవేర్చాడా.. అన్నది  మిగతా కధ .


కథనం - విశ్లేషణ: 

‘బాహుబలి: ది బిగినింగ్’ లో కాలకేయులతో యుద్ధం తరువాత పరిస్థితులను కట్టప్ప వివరిస్తూ ఆరంభమవుతుంది  ‘బాహుబలి: ది కంక్లూజన్’. అమరేంద్ర బాహుబలి పరిచయ సన్నివేశం నుంచి ఫ్లాష్ బ్యాక్ ముగించే వరకు ఆ పాత్రని ఎలివేట్ చేయడం లో ఏ మాత్రం నిరాశపరచలేదు రాజమౌళి. బాహుబలి ఒక సామాన్యుడి గా కుంతల రాజ్యం లో అడుగుపెట్టి , పరిస్థితులకి తగ్గట్టు తన ధీరత్వాన్ని ప్రదర్శించే సన్నివేశం అద్భుతం. తానెవరో దేవసేన కి తెలిసి,అపార్ధం చేసుకున్న ఆ కొద్ది సమయం లోనే తన మీద నమ్మకం కలిగేలా చేసి తన వెంట మాహిశ్మతి రాజ్యానికి తీసుకెళ్ళే ఎపిసోడ్ కూడా బాగా వచ్చింది. హాంసనావ పాట  చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ఇక శివగామి-బాహుబలి మధ్య దూరం పెరిగే సన్నివేశం నుండి పట్టాభిషేకం ఎపిసోడ్ వరకు మరింత బలంగా నడుస్తుంది కధనం. ఇంటర్వెల్ లో బాహుబలి నామస్మరణ ఎపిసోడ్ "బిగినింగ్" కి " కంక్లూజన్’' కి లింక్ వేసినట్టుగా ఉండి ఒక్కసారిగా ఎమోషన్స్ ని తారాస్థాయి కి చేరుస్తుంది.
సెకండాఫ్ లో నిండు సభ లో దేవసేన కు జరిగిన అవమానానికి బాహుబలి సమాధానం చెప్పే సన్నివేశం ఐతే సినిమా మొత్తానికే హైలైట్ , ఆ తరువాత వచ్చే "దండాలయ్యా" పాట కూడా బాగుంది.

కంక్లూజన్’' విషయం లో ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూసేది కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే.. దాని వెనుక కారణం ఏమై ఉంటుంది అనేది అంత ఊహకందని విషయమేమీ  కాదు. దేవసేన పరిచయం నుండే ఆ ట్రాక్ కి సంభందించి లీడ్ అందిస్తూ వచ్చిన రాజమౌళి, కట్టప్ప బాహుబలిని చంపే సీన్ తాలూకు ఎపిసోడ్ మాత్రం ఆశించినంత బలంగా తెరకెక్కించలేకపోయాడు. ఏదో కీడు జరగబోతుంది లేదా బాహుబలి కి పెద్ద ద్రోహం తలపెడుతున్నారు అనే ఉత్కంఠను పెంచకుండా కాస్త హడావుడి గా ముగించేశాడు. ఐతే ఆ తరువాత కట్టప్ప-శివగామి మధ్య వచ్చే సన్నివేశం, మహేంద్ర బాహుబలి ని మాహిశ్మతి ప్రజలకు చూపించే సన్నివేశం తో మళ్ళీ ట్రాక్ లో పడుతుంది సినిమా.

ఫ్లాష్ బ్యాక్ ముగిసేవరకు ఒక ట్రాన్స్ మోడ్ లో ఉన్న ప్రజలని మరింత రంజింపచేయాల్సిన "భల్లాలదేవ-మహేంద్ర బాహుబలి" యుద్ధం మరింత ఎఫెక్టివ్ గా ఉండాల్సింది.కొన్ని వ్యూహ ప్రతి వ్యూహాల ఆలోచన కాస్త అతిశయోక్తి గా అనిపిస్తుంది  గ్రాఫిక్స్ కూడా "బిగినింగ్" లో ఉన్నంత స్థాయి లో లేకపోవడం మరో లోటు.

ఐతే ఈ లోపాలు సినిమా స్థాయిని కొద్దిగా తగ్గించ వచ్చేమో కానీ, ముందుగానే చెప్పుకున్నట్టు అమరేంద్ర బాహుబలి ని రాజమౌళి ఎలివేట్ చేసిన తీరు, అలాగే మిగతా పాత్రల చుట్టూ అల్లుకున్న తన ప్రధాన బలమైన ఎమోషన్స్ పండించడంలో చాలావరకు సఫలమయ్యాడు.


నటీనటులు:

ప్రభాస్  తనను తప్ప మరెవ్వరినీ అమరేంద్ర బాహుబలి గా  ఊహించలేనంత  బలంగా తన ముద్ర వేసాడు. తొలి భాగం తో పోలిస్తే ఇందులో తన పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ. అతని నటన/స్క్రీన్ ప్రెజన్స్ తో పాత్రని/సినిమా ని మరో మెట్టు ఎక్కించాడు అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. దేవసేన గా అనుష్క కూడా ఆకట్టుకుంటుంది. శివగామికి సవాలు విసిరే సన్నివేశాల్లో అనుష్క నటన ఆశ్చర్యపరుస్తుంది.భల్లాలదేవుడి గా రానా కు అంత స్కోప్ లేదు,ఉన్న కొద్దీ సన్నివేశాల్లో ఇంటర్వెల్ సన్నివేశం లో హావభావాల తో ఆకట్టుకున్నా,బాహుబలి చనిపోయిన తరువాత వచ్చే సన్నివేశం లో తేలిపోయాడు. కట్టప్ప గా సత్యరాజ్ మెప్పించాడు ఐతే కుంతల రాజ్యం ఎపిసోడ్ లో తన పాత్ర ద్వారా కామెడీ రాబట్టాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. శివగామి గా రమ్యకృష్ణ,బిజ్జలదేవగా నాజర్ మరోసారి రాణించారు.

సాంకేతికవర్గం: 

మాటలు పరవాలేదు. కెమెరా/ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ అంచనాలని అందుకోలేదు. కీరవాణి అందించిన సంగీతం లో పాటలు బాగానే ఉన్నా, నేపధ్య  సంగీతం విషయం లో మాత్రం కొన్ని సన్నివేశాల్లో  మరింత బాగుండాల్సింది.


రేటింగ్: 7/10

Share on Google Plus

About aditya

Hai i am Aditya, a die hard telugu cinema fan and Critic,I watch almost all the telugu released on the first day and i will share my review in this blog

0 comments:

Post a Comment