చిత్రం : ‘గౌతమీపుత్ర శాతకర్ణి’
నటీనటులు: నందమూరి బాలకృష్ణ - శ్రియ సరన్ - హేమమాలిని - కబీర్ బేడి - మిలింద్ గుణాజీ - ఫరా కరిమి - తనికెళ్ల భరణి - శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: చిరంతన్ బట్
ఛాయాగ్రహణం: జ్నానశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: సాయిబాబా జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి
రచన - దర్శకత్వం: క్రిష్
కథ:
రాజులు.. రాజ్యాలు.. యుద్ధాలకు సంబంధించి అమ్మ చెబుతున్న కథ వింటూ.. ముక్కలు ముక్కలుగా ఉన్న భరత ఖండాన్ని ఏకం చేయాలని చిన్నతనంలోనే దృఢ నిశ్చయానికి వస్తాడు శాతకర్ణి. ఇక రాజ్యాధికారం చేపట్టగానే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తాడు. ముందు దక్షిణ భారతాన్ని గెలిచి.. ఆపై ఉత్తర భారతంపైకి దండెత్తుతాడు. ఈ క్రమంలో తన కొడుకు ప్రాణాలకే ముప్పు వాటిల్లినా.. తన భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తగ్గడు. ఈ క్రమం లో పరాయి దేశస్థుల నుంచి శాతకర్ణికి సవాలు ఎదురవుతుంది. మరి ఈ సవాలును శాతకర్ణి ఎలా ఛేదించాడు. రణరంగంలో ఎలా విజేతగా నిలిచాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తాను తీసే ప్రతి సినిమా లో ఎంతో కొంత వైవిధ్యం ఉండేలా, కాస్త ఆసక్తికరమైన కధలు,నేపధ్యాలనే ఎంచుకున్నాడు దర్శకుడు క్రిష్. అలాంటి దర్శకుడు బాలకృష్ణ వందవ చిత్రంగా తెలుగు ప్రజలకు అంతగా తెలియని, చరిత్ర లో సరైన సమాచారం లేని "గౌతమి పుత్ర శాతకర్ణి" కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
ప్రచారం లో భాగంగా తాను చాలా పరిశోధనలు జరిపిన తరువాతే ఈ సినిమా చేపట్టినట్టు చెప్పాడు క్రిష్. ఐతే మరి తనకు లభించిన ఆధారాలు,సమాచారం చాలా తక్కువ ఏమో అన్న సందేహం కలుగుతుంది సినిమా చూస్తే. శాతకర్ణి గురించి అంతగా ఆసక్తికరమైన విషయాలేమి చెప్పలేదు సినిమా లో. సినిమా ప్రధానంగా యుద్ధ నేపధ్యం లో సాగుతుంది. ప్రారంభం లో ఒకటి, ఇంటర్వెల్ వద్ద ఒకటి, మరొకటి క్లైమాక్స్ వద్ద. మూడిట్లో మొదటి యుద్ధం పరిచయ సన్నివేశం గా వాడుకున్నారు, అది తొందరగానే అయిపోతుంది, నహాపనుడితో జరిగే రెండవ యుద్ధం సుదీర్ఘంగా సాగుతుంది, ఐతే ఈ యుద్ధం లో ఏదో ముఖ్య పాత్రధారి హీరో కాబట్టి అనుకున్నదే తడవుగా గెలిచినట్టు కాకుండా, వ్యూహ ప్రతివ్యూహాలు చూపించడం బాగుంది. అదే క్రమం లో హీరోయిజం ఎలివేట్ అయ్యే డైలాగ్స్ కూడా పడ్డాయి ఈ ఎపిసోడ్ లో. ఐతే కొడుకు ని కాపాడే సన్నివేశం మరింత వివరంగా చూపించాల్సింది,కొంచెం జాగ్రత్త వహించి ఉంటే ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చేది.
ఇక మూడో యుద్ధం సినిమా చివర లో వస్తుంది,ఇది సుదీర్ఘంగానే సాగినా, అంచనాలకు తగ్గట్టు ప్రభావితం చేయలేకపోయింది. ఇవి కాక సినిమా లో తల్లి, భార్యలతో శాతకర్ణి కి ఉన్న అనుభందం చూపించారు. తన యుద్ధ దాహానికి విసిగిపోయి, కొడుకు ప్రాణాలను ప్రమాదం లో పెట్టినందుకు భార్య అతన్ని నిందించి విడిపోవడం, తరువాత అతని ఉద్దేశ్యం తెలిసి దగ్గరవడం వంటి సన్నివేశాలతో బాగానే డ్రామా పండింది ఈ ట్రాక్ లో. ఐతే తల్లి తో ఉన్న సన్నివేశాల్లో , తన పేరులో తల్లి పేరు చేర్చుకునే సన్నివేశం మినహా చెప్పుకోదగ్గ విషయం లేదు, శాతకర్ణి కి స్ఫూర్తి గా నిలవాల్సిన ఆ పాత్ర చుట్టూ సరైన సన్నివేశాలు లేవు.
బుర్ర కధ ఎపిసోడ్, నహాపనుడితో తో యుద్ధం లో శాతకర్ణి తన కొడుకు చెప్పే చందమామ కధ వింటూ అందులో నీతి ఏంటో చెప్పే సన్నివేశం, తల్లి పేరు తన పేరు లో కలుపుకునే సన్నివేశం, చివరి యుద్ధం ముందు చెప్పే పిట్ట కధ సన్నివేశాలు ,మరి కొన్ని చోట్ల చక్కని సంభాషణలు సినిమా కి ఆకర్షణగా నిలిస్తే, రెండవ యుద్ధం తరువాత చెప్పడానికి సరైన కధ లేకపోవడం, చివరి యుద్ధం చప్పగా సాగడం,ముఖ్య పాత్రధారి ఐన శాతకర్ణి లక్ష్యం/ఆంతర్యం గురించి సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వంటి అంశాల వల్ల చిత్రం మంచి ప్రయత్నం గా మిగిలింది తప్ప గొప్ప సినిమా కాకుండా పోయింది.
నటీనటులు:
టైటిల్ రోల్ లో బాలకృష్ణ నటన చాలా బాగుంది, సంభాషణలు పలికే తీరు లో మరోసారి తన ప్రత్యేకతని నిరూపించుకున్నాడు. వాశిష్ఠ దేవి గా శ్రియ నటన ఆకట్టుకుంది. కొడుకు కోసం, భర్త కోసం తపన పడే సన్నివేశాల్లో ఆమె నటన కట్టిపడేస్తుంది. తల్లి పాత్ర లో హేమ మాలీని తేలిపోయింది, ఇటు లిప్ సింక్ సరిగా లేక, అటు హావభావాలు సరిగా ఉండక, పాత్ర తీరు తెన్నులు కూడా సరిగా లేకపోవడం తో ఆమె రాణించలేకపోయింది. కబీర్ బేడీ, మిలింద్ గుణాజీ, తనికెళ్ళ భరణి పరవాలేదు. మిగతా వాళ్లందరూ కూడా బాగానే చేశారు.
ఇతర సాంకేతిక వర్గం:
సాయి మాధవ్ బుర్రా ఆకట్టుకున్నాడు, మరోసారి తనదైన శైలి లో సంభాషణలు అందించాడు. చిరంతన్ భట్ సంగీతం లో పాటలు పరవాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సార్లు బాగుంటే మరి కొన్ని సార్లు తేలిపోయింది. ఆర్ట్ వర్క్,కెమెరా వర్క్ సినిమా కి తమ వంతు సహకారం అందించాయి. ఐతే యుద్ధ సన్నివేశాల్లో విజువల్స్ పరంగా అబ్బురపరిచే ఎఫెక్ట్స్ ఏమి లేవు.
రేటింగ్: 6/10
0 comments:
Post a Comment