మహానటి రివ్యూ


Mahanati Movie Wallpapers


చిత్రం : ‘మహానటి’ 

నటీనటులు: కీర్తి సురేష్ - దుల్కర్ సల్మాన్ - సమంత అక్కినేని - విజయ్ దేవరకొండ - రాజేంద్రప్రసాద్ - షాలిని పాండే - మాళవిక నాయర్ - తనికెళ్ల భరణి - భానుప్రియ - దివ్యవాణి - తులసి తదితరులు
అతిథి పాత్రలు: మోహన్ బాబు - ప్రకాష్ రాజ్ - నాగచైతన్య - క్రిష్ - అవసరాల శ్రీనివాస్ - తరుణ్ భాస్కర్ - నరేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: డాని సాంచెజ్ - లోపెజ్
మాటలు: బుర్రా సాయిమాధవ్
నిర్మాతలు: అశ్వినీదత్ - స్వప్న దత్ - ప్రియాంక దత్
రచన - దర్శకత్వం: నాగ్ అశ్విన్



కథ: 

తన ప్రతిభ కు తగ్గ పని/గుర్తింపు దొరకట్లేదని కాస్త అసహనంగా కాలం గడిపే జర్నలిస్ట్ మధుర వాణి (సమంత) కి నటి సావిత్రి అనారోగ్యం తో కోమాలోకి వెళ్లిన వార్త తెలుస్తుంది. మొదట్లో సావిత్రి కేవలం  సినిమా నటి అనుకున్న వాణి కి ఆమె జీవితం తాలూకు ఆసక్తి కలిగించే చిన్నలింక్ దొరకడం తో సావిత్రి గురించి అన్ని వివరాలు తెలుసుకోవడం మొదలు పెడుతుంది.  ఆ క్రమం లో ఆమె కనుగొన్న నిజాలు ఏంటి.. తద్వారా ఆమె జీవితానికి జరిగిన మంచి ఏంటి అన్నది మిగతా కధ.


కధనం- విశ్లేషణ:

కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్.. కెరీర్ తోలి దశ లో ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ తో సావిత్రి జీవిత కథను  తెరకెక్కిస్తున్నాడు అంటే మొదట్లో కాస్త సందేహం రేపినా , ప్రోమో లు..పాటలు విడుదల ఐన తరువాత ఆసక్తి కలిగించిందీ "మహానటి".


ఒక మామూలు మధ్య తరగతి అమ్మాయి గా చిన్న తనం లో అందరి లాంటి అల్లరి పిల్ల గా మొదలైన ఆమె ప్రయాణం మద్రాస్ చేరి ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహానటి స్థాయి కి ఎలా చేరుకుంది అనే విషయాన్ని ఆసాంతం ఆకట్టుకునేలా,హత్తుకునేలా చూపించాడు దర్శకుడు. ఆమె ఎంత గొప్ప నటి అని తెలియచెప్పే పరిచయ సన్నివేశం అతని దర్శకత్వ ప్రతిభ కు ఒక మచ్చుతునక మాత్రమే. ఏఎన్నార్.. ఎస్వీఆర్ ల తో ఉన్న సన్నివేశాలు సావిత్రి లోని చిలిపి తనం,అల్లరి ని చూపిస్తూ కాస్త హాస్యాన్ని పండించాయి.. అలాగే సావిత్రి సినీ ప్రయాణం లో అప్పటి దర్శకులు, సినీ పెద్దలు అయిన కేవీ రెడ్డి.. చక్రపాణి.. ఎల్వీ ప్రసాద్ వంటి వారి పాత్ర  ఎలా ముడిపడిందో చూపించిన సన్నివేశాలు కూడా అంతే ఆకట్టుకున్నాయి.

ఇక సావిత్రి- జెమినీ గణేషన్ ల ప్రేమ కధ ను నడిపించిన తీరు ఐతే అద్భుతం. . వాళ్లిద్దరూ దగ్గరయ్యే క్రమం లో సావిత్రి ఆ సమయం లో చేస్తున్న సినిమాలు, పాటలను నాగ్ అశ్విన్ ఉపయోగించుకున్న తీరు కి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాళ్ళ ప్రేమ విషయం ఇరు వర్గాల ఇంట్లో తెలిసి.. గొడవ జరిగే ఎపిసోడ్ లో డ్రామా బాగా పండింది.  తన ప్రేమ కోసం సావిత్రి ఆ సమయం లో ప్రపంచం ఎదురు వచ్చినా నిలుస్తుంది అన్న గాఢతను చూపిస్తూనే, జెమీని గణేశన్ వైవాహిక జీవిత పరిస్థితుల వల్ల ఆమె నిస్సహాయ స్థితి లో ఉండిపోవడం మనసును కదిలించే విధంగా చూపించాడు దర్శకుడు . ఆ పై ఆమె మహానటి గా ఎదిగే క్రమం లో వచ్చే టైటిల్ సాంగ్ చెరగని ముద్రే వేసింది. ప్రజల్లో ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతలు కారణంగా భర్త లో రగిలిన అసూయ వల్ల ఇద్దరి మధ్య ఏర్పడే దూరం ...  ఆ ప్రభావం వల్ల  మెల్ల మెల్లగా ఆమె కెరీర్ తో పాటు జీవితం కూడా తల్ల కిందులయ్యే ఉదంతం.. నమ్మిన వాళ్లే ఆమెను నిలువునా ముంచి పరిస్థితులు అన్ని ఆమెకు ప్రతికూలంగా మారి.. తాగుడు కు బానిసై .. కష్టాల పాలైన వైనాన్ని అంతే నిక్కచ్చిగా చూపించిన తీరు కళ్ళు చెమర్చేలా చేస్తుంది. ముఖ్యంగా చివరి అరగంట ను భావోద్వేగాలతో నింపేశాడు నాగ్ అశ్విన్.

చివర్లో సావిత్రి కధకు , మధుర వాణి ఉప కధకు లింక్ పెట్టి ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. అప్పటి దాకా ఉన్న ఎమోషనల్ టోన్ ని కాస్త తగ్గిస్తూ "శంకరయ్య" పేరు వెనక ఉన్న మిస్టరీ ని చూపించే ముగింపు సన్నివేశం .. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ ను తెలియజేస్తుంది.

హీరోయిన్స్ కి నటన కు స్కోప్ ఉన్న  పాత్రలు దక్కడమే తక్కువ.. అలాంటిది సావిత్రి గా నటించడం అంటే మాటలు కాదు.. అరుదుగా దొరికే అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న కీర్తి సురేష్ తన అద్భుత నటన తో కట్టి పడేస్తుంది. ఫలానా సీన్ లో బాగా చేసింది అని చెప్పుకుంటూ పొతే ఉన్న సీన్ లు అన్ని రాసేయచ్చు.. అంతలా సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. అలాగే జెమిని గణేశన్ గా చేసిన దుల్కర్ సల్మాన్ కూడా అంతే అద్భుతంగా...  సమర్ధవంతంగా పాత్రని  పోషించాడు.

మధురవాణి గా సమంత నటన కూడా బాగుంది, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో.. ఆమె ప్రేమికుడి గా విజయ్ దేవరకొండ పరవాలేదు. చాలా రోజులకి రాజేంద్ర ప్రసాద్ కి మంచి పాత్ర లభించింది, సావిత్రి పెదనాన్న గా అయన తనదైన శైలిలో నటించి అలరించారు.. నాగచైతన్య, మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్‌, క్రిష్‌ లు అప్పటి ఇండస్ట్రీ లెజెండ్స్ గా నటించి ఆకట్టుకున్నారు. తనికెళ్ల భరణి,నరేష్, దివ్య వాణి ,భాను ప్రియ,జబర్దస్త్ మహేష్ .. తదితరులు ఆయా పాత్రలకు సరిపోయారు.

ఆర్ట్/కెమెరా డిపార్ట్మెంట్ లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించడం లో సఫలమయ్యారు. అలాగే మిక్కీ జె మేయర్ సంగీతం లో పాటలు అన్ని సినిమా లో చక్కగా కుదిరాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కి మరో బలం అని చెప్పవచ్చు.


రేటింగ్: 80/100 
Share on Google Plus

About aditya

Hai i am Aditya, a die hard telugu cinema fan and Critic,I watch almost all the telugu released on the first day and i will share my review in this blog

0 comments:

Post a Comment